సివిల్ కేసులో తలదూర్చిన ఎస్‌ఐ శ్రీరామ్‌శ్రీనివాస్
టీడీపీ నాయకుల తరఫున వత్తాసు..
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కుటుంబంపై హుకుం
రాజీకి రాకుంటే చంపుతామంటూ బెదిరింపులు
విచారణ పేరుతో మహిళా ఎంపీటీసీపై దూషణ
బంధువును పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన వైనం
న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామన్న బాధితులు
రాయదుర్గం అర్బన్ : అధికార తెలుగుదేశం పార్టీ నేత మెప్పు కోసం బొమ్మనహాళ్ ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబంపై జులుం ప్రదర్శించారు. సివిల్ కేసులో తలదూర్చటమే కాకుండా.. ఎంపీటీసీ కుటుంబ సభ్యులను అవమానకర రీతిలో దూషించటమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసే.. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించారు. ఎస్‌ఐ ఆగడాలపై బాధిత నేమకల్లు ఎంపీటీసీ సభ్యురాలు తులసమ్మ, భర్త, మాజీ ఎంపీటీసీ పరమేశ్వరప్ప, ఆయన తల్లి గంగమ్మ, అన్న గాదిలింగ, మామలు నాగేంద్రప్ప, బసప్ప, బంధువు గోవిందప్ప, వీరి అనుచరుడు బోయ రామాంజనేయులు తదితరులు మంగళవారం రాయదుర్గంలో మీడియా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
నకిలీ డాక్యుమెంట్లతో దౌర్జన్యం
పరమేశ్వరప్ప తండ్రి కురుబ హనుమంతప్ప 1994 మార్చి 16న నేమకల్లు గ్రామ పొలం సర్వే నంబర్ 223/2లో విస్తీర్ణం 4.18 ఎకరాలు పైకి 2.09 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 2008లో ఈయన మరణించాడు. ఇదే సర్వేనంబర్ తూర్పు దిశన ఉన్న 2.09 ఎకరాల భూమిని టీడీపీ నేత టీవీఎస్ కాంతారావు సోదరుడు అప్పారావు పేరిట 2014లో కొనుగోలు చేశారు. ఈ భూమిలో కాంతారావు క్రషర్ ఏర్పాటు చేసుకున్నాడు. కురుబ హనుమంతప్ప 2.09 ఎకరాల భూమిని కూడా తనకు అమ్మినట్లు కాంతారావు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆక్రమించుకున్నాడు. సంతకం కాకుండా వేలిముద్ర అందులో ఉండటంతో ఇదంతా చీటింగ్ అని, ఫోర్జరీ సంతకం చేశారని పరమేశ్వరప్ప 2016 అక్టోబర్ 17న బొమ్మనహాళ్ పోలీస్‌స్టేషన్‌లో కాంతారావు, ఆయన సోదరుడు అప్పారావులపై ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్ 69/16, సెక‌్షన్ 420,506 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
అయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో కాంతారావు సోదరులు ఈ నెల 16న పరమేశ్వరప్ప పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తమ క్రషర్ కూలీలకు షెడ్లు వేయడానికి ఈ నెల 16న గుంతలు తీయించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పరమేశ్వరప్పను ‘ప్రభుత్వం మాది, మీ భూమిని అక్రమించుకుంటాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ కాంతారావు దౌర్జన్యం చేయడంతో పాటు ఇంకోసారి పొలంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించాడు. తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పరమేశ్వరప్ప కుటుంబ సభ్యులపై కాంతారావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో ‘రూ. 6లక్షలు ఇప్పిస్తా... భూమిని వదిలిపెట్టాలం’టూ ఎస్‌ఐ బెదిరించాడని పరమేశ్వరప్ప తెలిపారు. ప్రస్తుతం ఎకరా భూమి అక్కడ రూ. 10లక్షలు ఉందని తెలిపినప్పటికీ, పట్టించుకోవడం లేదని, కాంతారావు కంటే కూడా ఎస్‌ఐ వేధింపులే అధికమయ్యాయని వాపోయారు.
న్యాయం కోసం ఎస్పీకి ఫిర్యాదు
కాంతారావు ఫిర్యాదు నేపథ్యంలో ఎస్‌ఐ శ్రీరాం శ్రీనివాస్ తమను బెదిరిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 21న జిల్లా ఎస్పీకి తాము ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎంపీటీసీ పరమేశ్వరప్ప, ఎంపీటీసీ తులసమ్మ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీరాం శ్రీనివాస్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తాను లేని సమయంలో ఇంటికి వచ్చి అన్న కూతురు పవిత్ర భోజనం చేస్తుంటే ప్లేటును బూటు కాలితో తన్నాడని, తన భార్య తులసమ్మను బండబూతులు తిట్టాడని పరమేశ్వరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాతో పెట్టుకుంటాడా.. చంపేస్తా.. నా కొడుకును.. ఎస్పీ వద్దకు వెళతాడా, నేనేమిటో చూపిస్తా ...నేననుకుంటే మీరు ఉంటారా.. అంటూ ఇల్లంతా బూటుకాళ్లతోనే వెదికి, చివరికి క్రైం నంబర్ 03/2017 సెక్షన్ 447,427,506 రీడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు(కాంతారావు ఫిర్యాదు)లో ముద్దాయిలుగా ఉన్నారని, 15 రోజుల్లోగా స్టేషన్‌లో హాజరుకావాల’ని హెచ్చరించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయాన్నే ఎస్‌ఐ మరోసారి తమ ఇంటికి వచ్చి అల్లుడు వన్నూరుస్వామిని ఈడ్చుకెళ్లారని, అతడిని ఏం చేస్తారోనన్న భయం వెంటాడుతోందని విలపించారు.
విచారించేందుకు వెళ్లా – ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్
ఈ విషయంపై సాక్షి ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్‌ను వివరణ కోరగా, కాంతారావు ఫిర్యాదు మేరకు తాను విచారించేందుకు గ్రామానికి వెళ్ళానని, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించలేదని తెలిపారు.
==========================
ఖాకీ జులుం
Published Wed, Jan 25 2017 12:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement