గొంతెత్తితే ఉక్కుపాదం
గొంతెత్తితే ఉక్కుపాదం
Published Thu, Sep 22 2016 11:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
తుళ్లూరు రూరల్ :
ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన రాజధాని ప్రాంత రైతుల్లో కొందరు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలోని పాఠశాలలో గురువారం సాదాసీదాగా సమావేశం కావాలని భావించారు. ఈ విషయం తెలియడంతో సర్కారు వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తాజాగా రాజధాని గ్రామాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ అసలు కథ..
రాజధాని గ్రామాల పరిధిలో ఉన్న 5,524 ఎకరాల లంక, అసైన్డ్, దేవాదాయ భూములకు సంబంధించిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ప్లాట్లు కూడా ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పేశారు. ఉన్న గ్రామాలను కూడా తొలగించి సింగపూర్ సంస్థకు అప్పగిస్తారని తెలిసి తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులను కలిసి పలుమార్లు వివరించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ వేదనను పట్టించుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రైతులంతా భవిష్యత్ ప్రణాళికపై చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఉద్దండ్రాయునిపాలెం గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ మేరకు కుల వివక్ష పోరాట సమితి నాయకుల సహకారంతో గురువారం సాయంత్రం ఉద్దండ్రాయునిపాలెంలో సమావేశానికి సిద్ధమయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండా పాఠశాల ఆవరణలోని అరుగుపై కూర్చొని చర్చించుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో పోలీసులకు హుకుం జారీ చేశారు. రైతులు నోరెత్తకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే అక్రమ కేసులు పెట్టి లోపలకు నెట్టాలని గట్టిగా చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి వరకు తహశీల్దార్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా, ఉన్నట్లుండి గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తుళ్లూరు ఎస్‌ఐ ప్రకటించారు. బిత్తరపోయిన గ్రామస్తులు, మహిళలు.. ‘ఇక్కడ ఏం జరుగుతుందని పోలీసులు హడావుడి చేస్తున్నారు? ఇదేం అన్యాయం. మాట్లాడుకోవటానికి కూడా స్వేచ్ఛ లేదా... అంటూ పోలీసులపై తిరగబడ్డారు.
పలువురి అరెస్ట్
స్థానికుల ఆవేదనను పోలీసులు పట్టించుకోలేదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. గ్రామస్తుల వినతి మేరకు వచ్చిన రైతు సంఘం నాయకులు గద్దె చలమయ్య, జొన్నా శివశంకర్, కులవివక్ష పోరాట సమితి నేతలు మాల్యాద్రి, కృష్ణమోహన్, ఎం.రవి, నవీన్‌ప్రకాష్, వీర్ల అంకయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ‘మా గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవటానికి మీ అనుమతి కావాలా..’ అంటూ మహిళలు ఎదురు తిరిగారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టకపోతే పోలీసు వాహనాలు వెళ్లనీయబోమని మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలను వదిలేసి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement