పోలీసుల అత్యుత్సాహం
– వైఎస్సార్‌సీపీ నేతల ముందస్తు అరెస్ట్
– హోదాపై ప్రశ్నిస్తారనే దురుద్దేశంతోనే..
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ముందస్తు అరెస్ట్‌ల పేరుతో శనివారం ఉదయమే వైఎస్సార్‌సీపీ నేతలను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావడంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలపాలని భావించారు.
అందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ గోరంట ్లమాదవ్, శింగనమల ఎస్‌ఐ హమీద్‌ఖాన్ అక్కడికి చేరుకుని నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రిని నిలదీస్తారనే ఈ అరెస్ట్‌లు చేసినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండిపరుశురాం, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు మారుతీనాయుడు, అధికారప్రతినిధి పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు రఫీ, నాయకులు రాఘవేంద్ర, రమణ, పురుషోత్తం, నూర్‌బాషా, సాకేనవీన్ తదితరులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.