‘పురం’లో కొనసాగుతున్న బందోబస్తు
– ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
– అదుపులోకి అనుమానితులు
హిందూపురం అర్బన్ : మూడు రోజులుగా హిందూపురంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు హిందూపురంపై ప్రత్యేక దష్టి సారించారు. పోలీస్ బలగాలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్సు బందోబస్తు కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం పలు మసీదుల వద్ద బందోబస్తు ముమ్మరం చేశారు. సాయంత్రం ఎస్పీ విచ్చేసి సంఘటన జరిగిన ప్రాంతాలతో పాటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న రహమత్‌పురం, శ్రీకంఠపురం ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. ముస్లిం సోదరులు నేరుగా మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్లిపోయారు.
31 మంది తరలింపు
రమమత్‌పురం, శ్రీకంఠపురం ప్రాంతాల్లో జరిగిన గొడవలు, ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి అనుమానం ఉన్న సుమారు 31 మందిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించినట్లు సమాచారం. అక్కడ ఎస్పీ సమక్షంలో ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. మరికొందరి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నారు.