sp rajasekharbabu
-
45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని 45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకోసం ఎదురుచూస్తున్న 1996 బ్యాచ్‌లోని 45 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించినట్లు ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనీ, అందువలన జాప్యం జరిగిందని తెలిపారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు
– పట్టభద్ర ఓటర్లు 2,49,582 – ఉపాధ్యాయ ఓటర్లు 20,515 – జిల్లాలో పోలింగ్ కేంద్రాలు 190 – ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాగం అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజవకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 9వ తేదీన జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 25 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా యంత్రాగం పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే బ్యాలెట్ బాక్కులు, బ్యాలెట్ పత్రాలను పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం మంగళవారం ఆరు గంటలతో ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టంది. పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు పట్టభద్ర నియోజకవర్గం పరిధిలో 2,49,582 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో 20,515 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో 524 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక అనంతపురం జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 88,823 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 7,875 మంది ఉన్నారు. జిల్లాలో 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పట్టభద్ర ఎమ్మెల్సీకి 125 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు పంపిణీ కేంద్రాలు ఎన్నికలకు సంబంధించి బాలెట్ బాక్కులు, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతపురం డివిజన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు), ధర్మవరం డివిజన్లో ఆర్డీఓ కార్యాలయం, కళ్యాదుర్గం డివిజన్లో తహశీల్దారు కార్యాలయం, పెనుకొండ డివిజన్లో తహశీల్దారు కార్యాలయం, కదిరి రెవెన్యూ డివిజన్లో ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునేందుకు పోస్టల్ పెసిలిటేషన్ కౌంటర్లను కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఏర్పాటు చేశారు. స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు ఉండాలి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ల స్లిప్పుతో పాటు ఏదేది గుర్తింపు కార్డు తప్పని సరిగా ఉండాలి. ఓటరు తమ వెంట పాస్ పోర్టు, ఆధార్ కార్డు, డ్రై వింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, తదితర వాటిల్లో ఏదో ఒక దానిని తీసుకువచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. పోలీసు బందోబస్తు ఇలా.. ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 190 పోలింగ్ కేంద్రాలను 84 పోలింగ్ ప్రాంతాలుగా తీసుకుంది. ఇందులో ఐదు అంత్యంత సమస్మాత్మకమైనవిగా, 30 సమస్యాతమ్మకమైనవిగా, 155 సాధారణమైనవిగా గుర్తించారు. పది పికెటింగ్ సెంటర్లు, ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుకు 2,713 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. తొమ్మిది మంది డీఎస్పీలు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 121 మంది ఎస్ఐలు, 429 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,348 మంది కానిస్టేబుళ్లను, 380 మంది హోంగార్డులు, 405 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. అన్ని పోలింగ్ స్టేఫషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫీ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జార్వర్ ఉంటారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం ముగిసింది. అప్పటి నుంచి డ్రైడే పాటించేలా చర్యలు తీసుకున్నాము. కౌంటింగ్ 20వ తేదీన నిర్వహిస్తాము. – కోన శశిధర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కట్టుదిట్టమైన భద్రత శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలింగ్ సజావుగా జరిగేందుకు కట్టుబదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాము. 2,713 మంది పోలీసు సిబ్బందిని నియమించాము. ఎన్నికల దృష్ట్యా రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించాము. 450 మందిని బైండోవర్ చేశాము. క్రిమినల్ కేసులున్న వంద మందికిపైగా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశాము. మంగళవారం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఇతర జిల్లాల వారు ఇక్కడి లాడ్జిలు, కళ్యాణమండపాలు, వసతి గృహాల్లో ఉండకూడదు. వాటిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాము. ఇప్పటికే డీఎస్పీలు, సీఐలతో ఎన్నికల బందోబస్తుపై సమీక్షించాను. – ఎస్.వి.రాజశేఖర్‌బాబు, జిల్లా ఎస్పీ -
పోలీసు విధుల్లో టెక్నాలజీ కీలకం
అనంతపురం సెంట్రల్ : టెక్నాలజీ పోలీసు విధుల్లో కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం డీటీసీలో విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో ముఖాముఖి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ టెక్నాలజీపై పరిజ్ఞానం పెంచుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ఇండోర్ శిక్షణలో భాగంగా ఐపీసీ ఎవిడెన్స్‌యాక్టు, పర్సనాలిటీ డెవలప్మెంట్, సీఆర్పీసీ, స్టేషన్‌హౌస్ మేనేజ్మెంట్, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్‌సైన్స్, లా అండ్ ఆర్డర్, అవుట్‌డోర్‌లో భాగంగా యోగా, ధ్యానం, వెపన్ ట్రైనింగ్, క్రౌండ్ కంట్రోల్, ఫీల్డ్ క్రాప్ట్ తదితర అంశాలపై నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆయన రూరల్ మండలం కామారుపల్లి గ్రామ సమీపంలోని డీటీసీ(జిల్లా శిక్షణా కేంద్రం) కోసం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు శివనారాయణస్వామి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మెళవాయి ఘటనపై విచారణకు ఆదేశం
కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి వద్ద రైతుల పట్ల కాంట్రాక్టర్ అమానుష చర్యపై విచారణ చేసి.. నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోనశశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కూడా ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరారు. నష్టపరిహారం ఇవ్వకుండానే తమ పొలంలో చేపట్టిన 220 కేవీ విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన తండ్రీకొడుకులు నబీరసూల్, వన్నూర్సాబ్పై కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్, కర్ణాటక, ఆంధ్ర విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలోనే అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
డయల్ –100కు 2,357 ఫిర్యాదులు
అనంతపురం సెంట్రల్ : సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్ –100కు జనవరిలో 2,357 ఫోన్‌కాల్స్ వచ్చాయని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నట్లు వివరించారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నూతన ఒరవడికి పోలీసులు శ్రీకారం
అనంతపురం సెంట్రల్ : పోలీసులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా పూలబొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఈఏడాది మాత్రం అందుకు భిన్నంగా మొక్కలు అందించి, జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. వర్షాభావం ఉన్న అనంతపురం జిల్లాలో మొక్కలు నాటడడంతో ద్వారానే ‘ హరిత అనంత’గా మారుతుందనే ఉద్దేశాన్ని తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసు అధికారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మల్లికార్జునవర్మ, మల్లికార్జున, గంగయ్య, సీఐ రాజశేఖర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఏఎస్పీ మల్యాద్రి హాజరై కేక్ కట్ చేశారు. -
నేరాలకు అడ్డుకట్ట వేశాం
– గతంతో పోలిస్తే ఘననీయంగా తగ్గిన నేరాలు – వందశాతం నేరాలు, ప్రమాదాలు అరికట్టడం అసాధ్యం – 2016 సమీక్షలో ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడి అనంతపురం సెంట్రల్ : గతంలో పోలిస్తే నేరాలు ఘననీయంగా తగ్గాయని ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక్షన్ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్థంగా చర్యలు చేపట్టామని వివరించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దొంగతనాలు ఛేదింపు వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. 100 శాతం రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు నిర్మూలించడం సాధ్యం కాదన్నారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో 2016లో నేరాలు– పోలీసుల పనితీరుపై విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 6,860 కేసులు నమోదయ్యాయి. ఇందులో లబ్ధి కోసం 4 హత్యలు, 3 దోపీడీలు, 12 రాబరీలు, 242 బగ్లరీస్, 479 సాధారణ దొంగతనాలు, 117 హత్యలు, 99 దాడులు, 69 కిడ్నాపులు, 33 అత్యాచారాలు, 186 హత్యాయత్నాలు, 1,394 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయని వివరించారు. వీటిలో 637 మంది మృతి చెందగా 2,084 మంది గాయపడ్డారని తెలిపారు. గతంతో పోలీస్తే వీటి సంఖ్య చాలా తక్కువన్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు బాగా తగ్గాయన్నారు. చోరీల సొమ్ములో రూ.2.50 కోట్లు విలువైన ఆభరణాలు, నగదు రీకవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా గుండా అక్రమంగా రవాణా చేసే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడిందన్నారు. మోటార్ వెహికల్ చట్టం ద్వారా 2,37,768 కేసులు నమోదు చేసి రూ.3.90 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాలపై 103 కేసులు నమోదు చేసి 118 ట్రాక్టర్లు, 41 లారీలు, 11 జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కుటుంబ కలహాలు, పేదరికం, అప్పులు, ప్రేమ విఫలం తదితర కారణాలతో 751 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నేరస్తుల్లో పరివర్తన కోసం ఒక దొంగ– ఒక పోలీస్ కార్యక్రమాన్ని వినూత్నంగా ఆలోచించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్‌శాఖకే తలమానికంగా అధునాతన హంగులతో పోలీస్కల్యాణమండపం నిర్మించామన్నారు. రాబోయే సంవత్సరంలో మహిళా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. -
పోలీసుల సంక్షేమమే ధ్యేయం
పామిడి : విద్య, వైద్య, ఆరోగ్య, ఆర్థిక చేయూత పరంగా పోలీసుల సంక్షేమమే పోలీస్ వెల్ఫేర్ ధ్యేయమని ఎస్పీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం పామిడిలోని పోలీస్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన సీఐ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.40 లక్షల నిధులతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పామిడిలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్, అక్రమ ఇసుక రవాణాపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ట్రాఫిక్ నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డికి ఆదేశించారు. అంతకుముందు ఆయన కాంపెక్స్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ నిర్మాణంపై సంబంధిత సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రవిశంకర్‌రెడ్డితో సమీక్షించారు. ఎస్పీ వెంట తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి ఉన్నారు. -
13 నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం సెంట్రల్ : కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ నెల 13 నుంచి 19 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ పరీక్షలో పాల్గొంటారని వివరించారు. ఎక్కడా లోటుపాట్లు రాకుండా అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. ఫిట్‌నెస్‌లో ఎంపికైన అభ్యర్థులకు పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
నేడు ఎస్ఐ పోస్టుల భర్తీకి రాతపరీక్ష
అనంతపురం సెంట్రల్ : పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో 20 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10260 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొననున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారిని బందోబస్తు విధులకు నియమించారు. పరీక్షల్లో పాల్గొను అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ కాని పక్షంలో హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 0884–2340535, 0884–2356255 నెంబర్లను సంప్రదించి ఈ మెయిల్ ఐడీలు తెలియజేస్తే హాల్‌టికెట్లు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు. -
గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలి
– ఎస్పీకి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల విజ్ఞప్తి అనంతపురం సెంట్రల్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై దాడిచేసిన సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐలు జనార్దన్, క్రాంతికుమార్‌ను సస్పెండ్ చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును కోరారు. శనివారం ఎస్పీని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం నాయకుడు హరినాథ్‌రెడ్డి, సీపీం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ సీఐ మాధవ్ తనకు సంబంధం లేని సివిల్ కేసులను డీల్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. పోలీసులు దాడిచేసిన విషయం స్పష్టంగా వీడియోలో కనబడుతున్నా నామమాత్రంగా చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. సీఐ మాధవ్ వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చని ఎస్పీ తెలిపారన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు విజయకుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎంఎల్న్యూ డెమోక్రసీ నాగరాజు, వైఎస్సార్ విద్యార్థి సంఘం నాయకుడు ఆవుల రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
‘పురం’లో కొనసాగుతున్న బందోబస్తు
– ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ – అదుపులోకి అనుమానితులు హిందూపురం అర్బన్ : మూడు రోజులుగా హిందూపురంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు హిందూపురంపై ప్రత్యేక దష్టి సారించారు. పోలీస్ బలగాలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్సు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు మసీదుల వద్ద బందోబస్తు ముమ్మరం చేశారు. సాయంత్రం ఎస్పీ విచ్చేసి సంఘటన జరిగిన ప్రాంతాలతో పాటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న రహమత్‌పురం, శ్రీకంఠపురం ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. ముస్లిం సోదరులు నేరుగా మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్లిపోయారు. 31 మంది తరలింపు రమమత్పురం, శ్రీకంఠపురం ప్రాంతాల్లో జరిగిన గొడవలు, ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి అనుమానం ఉన్న సుమారు 31 మందిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించినట్లు సమాచారం. అక్కడ ఎస్పీ సమక్షంలో ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. మరికొందరి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నారు.