రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు
– పట్టభద్ర ఓటర్లు 2,49,582
– ఉపాధ్యాయ ఓటర్లు 20,515
– జిల్లాలో పోలింగ్ కేంద్రాలు 190
– ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాగం
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజవకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 9వ తేదీన జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 25 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా యంత్రాగం పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే బ్యాలెట్ బాక్కులు, బ్యాలెట్ పత్రాలను పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం మంగళవారం ఆరు గంటలతో ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టంది. పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు
పట్టభద్ర నియోజకవర్గం పరిధిలో 2,49,582 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో 20,515 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో 524 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక అనంతపురం జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 88,823 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 7,875 మంది ఉన్నారు. జిల్లాలో 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పట్టభద్ర ఎమ్మెల్సీకి 125 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఐదు పంపిణీ కేంద్రాలు
ఎన్నికలకు సంబంధించి బాలెట్ బాక్కులు, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతపురం డివిజన్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు), ధర్మవరం డివిజన్‌లో ఆర్‌డీఓ కార్యాలయం, కళ్యాదుర్గం డివిజన్‌లో తహశీల్దారు కార్యాలయం, పెనుకొండ డివిజన్‌లో తహశీల్దారు కార్యాలయం, కదిరి రెవెన్యూ డివిజన్‌లో ఎస్‌టీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునేందుకు పోస్టల్ పెసిలిటేషన్ కౌంటర్లను కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఏర్పాటు చేశారు.
స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు ఉండాలి
ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ల స్లిప్పుతో పాటు ఏదేది గుర్తింపు కార్డు తప్పని సరిగా ఉండాలి. ఓటరు తమ వెంట పాస్ పోర్టు, ఆధార్ కార్డు, డ్రై వింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, తదితర వాటిల్లో ఏదో ఒక దానిని తీసుకువచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి.
పోలీసు బందోబస్తు ఇలా..
ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 190 పోలింగ్ కేంద్రాలను 84 పోలింగ్ ప్రాంతాలుగా తీసుకుంది. ఇందులో ఐదు అంత్యంత సమస్మాత్మకమైనవిగా, 30 సమస్యాతమ్మకమైనవిగా, 155 సాధారణమైనవిగా గుర్తించారు. పది పికెటింగ్ సెంటర్లు, ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుకు 2,713 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. తొమ్మిది మంది డీఎస్‌పీలు, 21 మంది ఇన్‌స్పెక్టర్లు, 121 మంది ఎస్‌ఐలు, 429 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,348 మంది కానిస్టేబుళ్లను, 380 మంది హోంగార్డులు, 405 మంది ఆర్మ్‌డ్ పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం
పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. అన్ని పోలింగ్ స్టేఫషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫీ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఒక మైక్రో అబ్జార్వర్ ఉంటారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం ముగిసింది. అప్పటి నుంచి డ్రైడే పాటించేలా చర్యలు తీసుకున్నాము. కౌంటింగ్ 20వ తేదీన నిర్వహిస్తాము.
– కోన శశిధర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి,
కట్టుదిట్టమైన భద్రత
శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలింగ్ సజావుగా జరిగేందుకు కట్టుబదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాము. 2,713 మంది పోలీసు సిబ్బందిని నియమించాము. ఎన్నికల దృష్ట్యా రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించాము. 450 మందిని బైండోవర్ చేశాము. క్రిమినల్ కేసులున్న వంద మందికిపైగా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశాము. మంగళవారం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఇతర జిల్లాల వారు ఇక్కడి లాడ్జిలు, కళ్యాణమండపాలు, వసతి గృహాల్లో ఉండకూడదు. వాటిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాము. ఇప్పటికే డీఎస్పీలు, సీఐలతో ఎన్నికల బందోబస్తుపై సమీక్షించాను.
– ఎస్.వి.రాజశేఖర్‌బాబు, జిల్లా ఎస్పీ