గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలి
– ఎస్పీకి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల విజ్ఞప్తి
అనంతపురం సెంట్రల్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై దాడిచేసిన సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐలు జనార్దన్, క్రాంతికుమార్‌ను సస్పెండ్ చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును కోరారు. శనివారం ఎస్పీని ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం నాయకుడు హరినాథ్‌రెడ్డి, సీపీం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ సీఐ మాధవ్ తనకు సంబంధం లేని సివిల్ కేసులను డీల్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు.
పోలీసులు దాడిచేసిన విషయం స్పష్టంగా వీడియోలో కనబడుతున్నా నామమాత్రంగా చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. సీఐ మాధవ్ వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చని ఎస్పీ తెలిపారన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు విజయకుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎంఎల్‌న్యూ డెమోక్రసీ నాగరాజు, వైఎస్సార్ విద్యార్థి సంఘం నాయకుడు ఆవుల రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు.