ఆడపడుచులకు పోలీసుల అండ
ఆడపడుచులకు పోలీసుల అండ
Published Sat, Nov 26 2016 11:16 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- ఏ కష్టమొచ్చినా పోలీసులను ఆశ్రయించండి
- నిహారిక మండలి స్ఫూర్తితో జీవితంతో పోరాడండి
- సేవ్ ది గర్ల్ చైల్డ్ సెమినార్‌లో ఎస్పీ ఆకె రవికృష్ణ పిలుపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఆడపడుచులకు జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. తన భార్య తప్ప జిల్లాలోని మహిళలందరూ తనకు అక్కా చెల్లెళ్లేనని, ఏ కష్టమొచ్చినా పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మహిళలను హించించినా, హత్యాహత్నం చేసినా, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని, అసవరమైతే రైడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఆదివారం మహిళల సమస్యల పరిష్కారం కోసం డీఎస్పీల ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్, ర్యాగింగ్ నిరోధానికి కాలేజీల్లో అమ్మకోసం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎస్పీ కార్యాలయం వ్యాస్ ఆడిటోరియంలో శనివారం ‘సేవ్ ది గర్ల్ చైల్డ్, క్రైమ్ అగనెస్టు ఉమెన్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌కు హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎస్ ప్లాస్టిక్ సర్జరీ కేంద్ర నిర్వాహకురాలు నిహారిక మండలి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..గర్భంలోనే పిల్లలను చంపిన, పుట్టిన పిల్లలను వదిలి వెళ్లిన వారి సంరక్షణ కోసమే సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచామని, ఎక్కడైనా ఆడ, మగ అని తెలిపే సంస్థలు ఉంటే తమకు తెలియజేస్తే వాటి ఆటకట్టిస్తామన్నారు. పుట్టిన బిడ్డను పెంచుకునే స్థోమత లేకుంటే డయల్ 100కు ఫోన్ చేస్తే సంసరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. నిహారిక మండలి మాట్లాడుతూ భర్తలు, ఇతరుల వేధింపులు తాళలేక అనేక మంది మహిళలు ఒంటికి నిప్పుపెట్టుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్నారని, తద్వారా వారి శరీరం అందవిహీనంగా తయారవుతుందన్నారు. ఇలాంటి వారిపై దయ, కరుణ చూపాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. స్వచ్ఛభారత్ చేపడుతున్న ప్రభుత్వాలు ముందు ప్రజల్లో స్వచ్ఛమైన ప్రేమానురాగాలు కలిగేలా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాదు, డైరెక్టర్లు పవన్‌రాజు, శశిధర్‌రెడ్డి, సీఐలు ప్రభాకర్, నాగరాజు యాదవ్, మహేశ్వరరెడ్డి, నాగరాజ రావు, ఆర్‌ఐ రంగముని పాల్గొన్నారు.
ఎవరీ నిహారిక మండలి..
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన నిహారిక మండలి బీఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో దాదాపు 90 శాతం శరీర భాగాలు కాలిపోయాయి. దీంతో చూడడానికి ఆమె అందహీనంగా ఉన్నా మనోధైర్యంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లో డాక్టర్ హరికిరణ్ సాయంతో ప్లాస్టిక్ సర్జరీపై అవగాహన పెంచుకొని బీఎస్‌ఎన్‌ఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేసి పలువురికి మార్గదర్శకంగా నిలిచారు.
Advertisement