ప్రతి కదలిక బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరణ
కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద పోలీసులు గృహనిర్భంధం నాలుగోరోజు శుక్రవారం కూడా కొనసాగుతోంది. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ముద్రగడ నివాసం వద్ద ప్రతి కదలికను పోలీసులు బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పోలీసుల నుంచి తనకు స్వేచ్ఛ కలిగినప్పుడే జేఏసీతో చర్చించి సత్యాగ్రహ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతానని అన్నారు, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.
మరోవైపు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసురెడ్డి ఏసుదాసు ,కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాగా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయిన ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే.