శంషాబాద్ (రాజేంద్రనగర్) : సామాజిక మాధ్యమాల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టింగ్స్ చేస్తున్నాడంటూ ఏపీ పోలీసులు శంషాబాద్‌లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఇంటూరి రవికిరణ్‌ను శనివారం ఉదయం ఆయన ఇంటి వద్ద వదిలివెళ్లారు. పొలిటికల్ పంచ్ పేరుతో సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ ల విషయంలో అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదుతో శుక్రవారం అర్థరాత్రి తుళ్లూరు పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అలా అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయనను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై ఒక పౌరుడిగా తాను స్పందించడం తప్పా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తనను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు తనను అరెస్ట్ చేసిన తర్వాత ఇన్నోవా వాహనంలో ఇక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. ఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత మధ్యాహ్నం వెలగపుడి సమీపంలో ఆటోతో పాటు వేర్వేరు వాహనాల్లో తిప్పారని చెప్పారు. చివరికి ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో తనను విచారించినట్లు తెలిపారు.
పొలిటికల్ పంచ్ వెనుక ఎవరెవరు ఉన్నారంటూ పదే పదే ప్రశ్నించారన్నారు. తన పోస్టింగ్‌ల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందా అంటూ ప్రశ్నలు వేశారన్నారు. పొలిటికల్ పంచ్ పూర్తి బాధ్యత తనదేనని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 25, 26 తేదీల్లో మరోసారి స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆదేశించారన్నారు.
పౌరుడిగా స్పందించడం తప్పా?
Published Sat, Apr 22 2017 10:24 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement