చెరువు నీరు లూటీ
► రోడ్డు విస్తరణకు నీటిని వినియోగించుకుంటున్న వైనం
రాయపోలు(దుబ్బాక): ప్రస్తుతం ఎండలు మండుతున్నాయ్.. మనుషులతోపాటు పశుపక్ష్యాదులు కూడా గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నాయ్... నీటి వనరులను ఎంతగా రక్షించుకుంటే అంత ప్రయోజనం అని.. ప్రభుత్వం, అధికారులు చెబుతున్నారు. అందుకనుగుణంగా నీటి వనరులైన చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. నీటిని నిల్వ ఉంచేలా చూడాలని సూచిస్తోంది. కానీ చెరువులో నీటిని కొందరు గుత్తేదారులు లూటీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు విస్తరణ పనులకు వినియోగించుకుంటున్నారు.
రాయపోలు మండలం కొత్తపల్లి పెద్ద చెరువులో గత వర్షాకాలంలో కురిసిన వానలకు నీరు నిండింది. ప్రస్తుతం ఆ చెరువులో నీరు నిల్వ ఉండడంతో ఆ సమీపంలోని బోర్లు అధికంగా నీరు పోసి పంటలు సాగవుతున్నాయి. కాగా అనాజీపూర్–వడ్డేపల్లి వరకు రోడ్డు నిర్మిస్తున్న గుత్తేదారు ఆ నీటిని తోడేస్తున్నారు. చెరువు వద్ద జనరేటర్ సహాయంతో నిత్యం పెద్దసంఖ్యలో ట్యాంకర్లలో నీటిని నింపుతున్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైతే ఎక్కడైన బోరును లీజుకు తీసుకుని వాడుకోవాలి. కానీ నయాపైసా ఖర్చు చేయకుండా చెరువు నీటిని లూటీ చేస్తున్నారు. ఈ చెరువు వట్టిపోతే ఆ గ్రామంలో పశువులు నీరు తాగేందుకు కూడా ఎలాంటి వనరులు లేవు. అధికారులు ఈ వైపు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.