‘పొలంబాట’ మరిచారు!
- నిద్ర మత్తులో వ్యవసాయ శాఖ
- కీలక సమయంలో అందని సలహాలు, సూచనలు
- పంటల సాగుకు చిల్లిగవ్వ లేక దిక్కులు చూస్తున్న రైతులు
వ్యవసాయశాఖ అధికారులు ‘పొలంబాట’ మరచిపోయారు. ఖరీఫ్ ఆరంభంలో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. మిగతా జిల్లాలతో పోలిస్తే అత్యధిక మెట్ట ప్రాంతం ‘అనంత’లోనే ఉండడం, ఏకంగా 8.30 లక్షల హెక్టార్లు వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి. ఈ కొద్ది సమయం ముగిసిపోతే ఏడాది పాటు పొలాలన్నీ బీళ్లుగా పెట్టుకోవాల్సిన దుస్థితి.
జిల్లాలో ముంగారు సాగుకు అనువుగా అక్కడక్కడ తొలకరి వర్షాలు పలకరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయశాఖ మొత్తం పొలంబాట పట్టాల్సి ఉంది. నేల స్వభావం, భూసార పరీక్షల ఫలితాలు, గత పంట కాలం స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇపుడు ప్రాంతాల వారీగా ఏ పంటలు వేసుకోవాలి. విత్తనాల ఎంపిక, నాసిరకంపై మెలకువలు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముందస్తు జాగ్రత్తలేంటి. రైతులకు అవసరమైన ఎరువులు, సూక్ష్మపోషకాలు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, ఇతరత్రా పథకాల గురించి సూచనలు, సాంకేతిక సలహాలు అందజేయాల్సి ఉంది. అయితే వ్యవసాయశాఖకు చెందిన అన్ని విభాగాల అధికారులు పల్లెబాట పట్టడానికి వెనుకాడుతున్నారు. 80 శాతం మంది అధికారులు మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఉన్న కార్యాలయాలకే పరిమితమవుతున్నారు.
గతంలో పల్లెపల్లెలో సమావేశాలు
గత ప్రభుత్వాల హయాంలో మే నెలలోనే ‘సాగుకు సమాయత్తం’ పేరుతో 15 రోజుల పాటు పల్లెల్లో సమావేశాలు నిర్వహించి కొంత వరకు రైతుల్లో అవగాహన కల్పించేవారు. వ్యవసాయశాఖతో పాటు పట్టు, పాడి, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖ, ఏపీఎంఐపీ, మార్కెటింగ్, ట్రాన్స్‌కో, శాస్త్రవేత్తలు.తదితర శాఖల అధికారులు, సిబ్బంది చైతన్యయాత్రలతో రైతులను అప్రమత్తం చేసేవారు. ఆ తర్వాత డివిజన్, జిల్లా స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటికి స్వస్తి పలికారు. ఇటీవల ఒకరోజు మాత్రం ఏరువాక పౌర్ణమితో సభ నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టారు.
చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు
చేతిలో చిల్లిగవ్వలేక ఖరీఫ్ సాగుకు ఎలా సమాయత్తం కావాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదు. మూడో విడతగా రావాల్సిన రూ.416 కోట్లు , 2014 ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా రూ.40 కోట్లు , 2015లో తుఫానుకు దెబ్బతిన్న వేరుశనగకు రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.24 కోట్లకు అతీగతీ లేదు., 2016లో దెబ్బతిన్న పంటలకు ఇస్తామన్న రూ.1,032.42 కోట్లు , 2016కు సంబంధించి రూ.419 కోట్ల వాతావరణ బీమా కూడా మంజూరు కాకపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారానికి లింకుపెట్టి ఇస్తామని చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పత్రాలు మాదిరిగానే ఇన్‌పుట్‌సబ్సిడీకి కూడా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెబుతుండటంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సమీక్షలు, నివేదికలే సమయం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిత్యం సమీక్షలు, సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్, వీడియోకాన్ఫరెన్స్, నివేదికల తయారీ, ప్రతిపాదనలు, యాక్షన్‌ప్లాన్‌లు పంపడానికి అధికారులకు సమయం చాలడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమీక్షలు, సమావేశాలకు మండల, డివిజన్ స్థాయి అధికారులు కూడా జిల్లా కేంద్రానికి రావాల్సి ఉండటంతో ఒక్కోసారి కార్యాలయాలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి . కీలకమైన ఏవోలు, ఏడీఏలకు వేరే పనిలేకుండా ఇలాంటి వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పనిచేయాల్సిన ఏఈవోలు, వందలాది మంది ఎంపీఈవోలు కూడా వెళ్లే పరిస్థితి కల్పించడం లేదు.