కేంద్ర మంత్రి తోమర్ నుంచి అవార్డు అందు కుంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం అగ్రికల్చర్/ నెల్లూరు (అర్బన్): కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం–కిసాన్ పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పలు విభాగాల్లో జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం–కిసాన్ సమ్మాన్ అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతికపరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుల్ని సాధించాయి. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 6 వేలతోపాటు రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.7,500 కలిపి రూ.13,500 నేరుగా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకే వేస్తున్నట్లు తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. అవార్డు స్ఫూర్తితో జిల్లాలో రైతు సమస్యల పరిష్కారానికి, వారి పంటకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, నెల్లూరు, అనంతపురం జేసీలు వై.ఆనందకుమారి, వై.రామకృష్ణ, అనంతపురం వ్యవసాయాధికారి బి.వంశీకృష్ణ, వ్యవసాయశాఖ నెల్లూరు ఏడీ అనిత పాల్గొన్నారు.
‘అనంత’ కృషి ఇదీ..
అనంతపురం జిల్లాలో పీఎం–కిసాన్ రైతుభరోసా సాయం అందుతున్న తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో 5.5 లక్షల మందికి పీఎం–కిసాన్ రైతుభరోసా అందుతోంది. కాగా, జిల్లాలో 28,505 మంది రైతులను ఎంపిక చేసి ఈ పథకం కింద సొమ్ము జమ అయిందా, లేదా.. అనే విషయాలను తెలుసుకున్నారు. ఇందులో మరే జిల్లాలో లేనివిధంగా 99.60 శాతం మంది రైతులను కలిసి వివరాలు సేకరించారు. ఈ ఘనత సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాకు ఈ అవార్డు అందజేసింది.
నెల్లూరు రైతుల సమస్యలు తీర్చినందుకు..
ప్రజాసాధికారిక సర్వేలో పేర్లు లేవనే ఉద్దేశంతో బ్యాంకులు వేలాదిమంది రైతుల ఖాతాలకు పీఎం–కిసాన్ సాయాన్ని జమచేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జెడ్పీ సీఈవో సుశీల, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంప్రసాద్‌రెడ్డిల సహకారంతో ఈ సమస్య తీర్చారు. బ్యాంకులు రిజెక్ట్ చేసిన ఖాతాలకు సంబందించి ఆర్టీజీఎస్ నుంచి ఏడువేల మంది రైతుల ఖాతా నంబర్లు సేకరించారు. గ్రామాలకు వెళ్లి రైతుల వివరాలు తీసుకుని సమస్యను పరిష్కరించారు. అన్నదాతల ఖాతాల్లో నగదు జమచేయించారు.
Comments
Please login to add a commentAdd a comment