పూలజాతరకు వేళాయే.. | poola jatharaku velaaye | Sakshi
Sakshi News home page

పూలజాతరకు వేళాయే..

Published Fri, Sep 30 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

పూలజాతరకు వేళాయే..

పూలజాతరకు వేళాయే..

పల్లె సంస్కృతిని, బతుకు గమనాన్ని చాటిచెప్పే పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో తొమ్మిది రోజులపాటు జరుపుకునే  వేడుకకు 
వేళయింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. 
 
నేడు ఎంగిలి పూల బతుకమ్మ 
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ సంస్కృతి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు కష్టాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తూ తమతోపాటు ఇతరులు కూడా చల్లంగా జీవించాలని పరితపిస్తుంటారు. బతుకు.. బతికించు.. అన్నదే తెలంగాణ ప్రజల జీవన వేదం. పల్లెలన్నీ పచ్చదనాన్ని పరుచుకుని ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే సమయంలో జరిగేదే బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల యువతులు, మహిళలు తీరొక్క పూలతో ఓలలాడుతుంటారు. నేడు ఎంగిలి పూల బతుకమ్మ (పెత్రామాస)ను పురస్కరించుకుని పండుగ విశిష్టతపై ప్రత్యేక కథనం.
– హన్మకొండ కల్చరల్‌
తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మ, దసరా పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే లేచి తోటల వద్దకు వెళ్లి పూలు తెచ్చుకుని అందంగా పేర్చుతారు. సాయంత్రం వేళలో ఆలయాల వద్దకు వెళ్లి ఆటపాటలతో సందడిగా గడుపుతుంటారు. 
చారిత్రక విభాత సంధ్యలో.. 
నిజాం రాజుల కాలంలో చాలా ఏళ్లు తెలంగాణ ప్రజలు అణచివేతకు గురై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేవారు. ఈ క్రమంలో వారు ఆలయాలను సందర్శించడం తక్కువగా ఉండేది. అలాంటి చారిత్రక విభాత సంధ్యలో బహిరంగంగా ఆలయాల్లో జరుపుకునే పూజలకు బదులుగా అనేక సంప్రదాయాల రూపంలో వచ్చిన ఎన్నో పండుగలు, ఆచారాలు ఇప్పటికి కనిపిస్తాయి. బతుకమ్మ పండుగ కూడా ఇలాంటి కోవకు చెందినదే.
సిల్‌సిలాగా కొలుపులు..
కాకతీయుల పాలనలో ఓరుగల్లు రాజకీయ కేంద్రంగా వర్ధిల్లింది. రాజ్య సంపదను పెంచేందుకు, ఇక్కడి ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు కాకతీయ రాజులు ప్రతి గ్రామానికి చెరువులను తవ్వించారు. చెరువు కట్టలపై గౌరీ ప్రియుడైన శివుడికి ఆలయాలను కూడా నిర్మిం చారు. వర్షం కురిస్తే చెరువులు నిండి సుభిక్షంగా ఉండే భౌగోళిక స్థితి తో పాటే వర్షాలు లేకపోతే కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం ఇది. అందుకే పండుగలను కూడా ఒకదాని వెంట మరొకటి నిర్వహించుకు నే తీరు కనిపిస్తోంది. కాలం కలిసి రావాలని ప్రకృతి దేవతలకు సిల్‌సిలాగా కొలుపులు నిర్వహించుకునే తీరు కనబడుతుంది. వర్షాలు రావాలని కప్పతల్లి ఆట ఆడుతారు. వానలు  ప్రారంభం కాగానే ఆషాఢమా సంలో కనకదుర్గమ్మ వంటలకు వెళ్తారు. శ్రావణంలో మళ్లీ వంటలకు వెళ్తారు. అలాగే పోచ్చమ్మకు బోనాలు నిర్వహిస్తారు. మైసమ్మ, ఎల్లమ్మ దేవతలకు పూజలు చేస్తారు. పొలాల అమావాన్య జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. తర్వాత భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి బొడ్డెమ్మను తొమ్మిది రోజుల పాటు ప్రతిషి్ఠంచి పెళ్లికాని అమ్మాయిలు ఆటలాడుతూ పూజించి బావుల్లో చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు. తర్వాత పెత్రామాస నుంచి బతుకమ్మ పండుగను జరుపుకోవడం ప్రారంభిస్తారు. 
కరువులో పుట్టింది బతుకమ్మ..
19వ శతాబ్దం ప్రారంభంలో అనేక క్షామాలు, కరువులు విలయతాండవం చేసినప్పుడు ప్రజలు తాము చల్లగా బతికేందుకు విభిన్నమైన రీతిలో బతుకమ్మ పండుగను ప్రారంభించినట్లు జానపదుల పరిశోధకుల అభిప్రాయం. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికి ఒక తల్లికి వరుసగా పిల్లలు పుట్టి చనిపోతున్నప్పుడు ఆ ఇంటివారు పుట్టిన పాపను చాటలో పెట్టి పెంట దిబ్బపై కొద్దిసేపు పడుకోబెట్టి పెంటయ్య లేదా పెంటమ్మ అని పేరు పెట్టే సంప్రదాయం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బ్రతుకు + అమ్మ = బతుకమ్మగా పిలిచి ఉంటారని అంటారు. మహిషాసురమర్ధన సమయంలో పార్వతీదేవి మూర్చిల్లి స్త్రీలు ఆందోళనతో బతుకమ్మ అని పాటలు పాడారని మరో అభిప్రాయం ఉంది. 
ఎంగిలి పూలతో ప్రారంభం..
భాద్రపద బహుళ అమావాస్యను పెత్రామాస అంటారు. ఈ రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు గ్రామంలోని శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, తదితర చోట్ల బతుకమ్మను అడుకుంటారు. తర్వాత రెండో రోజు నుంచి ఒక్కోక్క చోట బతుకమ్మలను ఉంచి ఆడుతారు. ఆరో రోజు అర్రెంగా భావించి బతుకమ్మ ను ఆడరు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. 
 
పితృ అమావాస్యగా...
తెలంగాణలో ఈ రోజున పితరుల/ పితృ అమావాస్యగా జరుపుకుంటారు. చనిపోయిన తమ ఇంటి పెద్దలకు ఆత్మ శాంతి కలుగాలని బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయమే తలస్నానం చేసి పొడి దుస్తులు కట్టుకుని పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తార్లలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు, వనగాయ, చెమ్మకాయ, బెండకాయ, బుడమకాయ, అనపకాయ, రూపాయి, కుంకుమడబ్బి పెట్టుకుని వస్తారు. బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి అతడితో బొట్టు పెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజు  పెద్దల(చనిపోయిన ఇంటి పెద్దలు) పేరిట బియ్యం ఇవ్వడం చేస్తారు. ఈ రోజున వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరారోజు బియ్యం ఇవ్వడం సంప్రదాయం.
n పాటకు ప్రాణం..
బతుకమ్మ పుట్టు చరిత్రను తెలియజేసే పాటను మొదట పాడిన తర్వాతనే మహిళలు ఇతర పాటలను పాడుతారు. 200 ఏళ్లకు పూర్వం నుంచే ఈ పాట ప్రచారంలో ఉందని సమాచారం. పూర్వం నుంచి మహిళలు పాడుకుంటున్న ఈ పాటను మొగిలిచర్లలోని భట్టు సరసింహ కవి రాసి పెట్టుకున్నాడు. 50 ఏళ్ల క్రితం తెలుగు జానపద పరిశోధనలో ఆధ్యుడైన జానపద బ్రహ్మ ఆచార్య బిరుదురాజు రామరాజు మొగిలిచర్ల గ్రామంలోని భట్టు నరసింహకవి వారసుల నుంచి ఈ పాటను సేకరించి తన జానపద గేయ సాహిత్య గ్రంథంలో పొందుపరిచారు. అలాగే బతుకమ్మ పం డుగపై మొదటి ఎంఫిల్‌ సిద్ధాంత వ్యాసం సమర్పించిన తాటికొండ విష్ణుమూర్తి తన పరిశోధనలో భాగంగా 25 ఏళ్ల  క్రితం కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లిలో ఈ పాటను సేకరించినప్పుడు యథాథతంగా లభించడం విశేషం. కొద్ది మార్పులతో ఈ పాట అన్ని జిల్లాల్లో వ్యాప్తిలో ఉండటాన్ని బట్టి ఇందులోని కథనే బతుకమ్మకు సంబంధించిన అసలు కథగా భావించాల్సి వస్తుంది. 
శివుడి వరం..
ధరచోళ రాజైన ధర్మాంగుడు, అతడి భార్య సత్యవతి అనేక నోములు నోచిన ఫలితంగా నూరుమంది సంతానం కలుగుతారు. అయితే వారు శత్రురాజుల్లో జరిగిన యుద్ధాల్లో హతమవుతారు. కుమారులు చనిపోయిన దుఃఖంతో దంపతులు శివుడి కోసం తపస్సు చేస్తారు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు వారు శివుడి ఇల్లాలు అయిన పార్వతీదేవీని తమ పుత్రికగా ప్రసాదించమని కోరుతారు. ఆ విధంగా పార్వతీదేవి వరంతో సాక్షాత్తు శ్రీలక్ష్మీదేవి, సత్యవతి ధర్మాంగదుల పుత్రికగా జన్మిస్తుంది. కశ్యపుడు, అంగీరసుడు, కపిలుడు మొదలైన మునులు ఆ పాపకు ‘బతుకమ్మ’ అని పేరు పెడుతారు. 
బతుకమ్మ మొదటి రోజు పాడే పాట
శ్రీలకీ‡్ష్మ దేవియు చందమామ –  సృష్టి బ్రతుకమ్మయ్యే చందమామ
పుట్టిన రీతి జెప్పే చందమామ –  భట్టు నరసింహకవి  చందమామ
ధర చోళ దేశమున చందమామ –  ధర్మాంగుడను రాజు చందమామ
ఆ రాజు భార్యయు చందమామ –  అతి సత్యవతి యంద్రు చందమామ
నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ
వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు చందమామ  – తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యమును బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ
వనితతో ఆ రాజు చందమామ   – వనమందు నివసించే చందమామ
కలికి లకీ‡్ష్మని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ
పుట్టుమని వేడగా చందమామ  – పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ – జన్మించే శ్రీలకీ‡్ష్మ చందమామ
అంతలో మునులనూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ
కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ
అత్రి వశిషు్ఠలూ చందమామ   – ఆ కన్నియను జూచి చందమామ
బ్రతుకు గనె ఈ తల్లి చందమామ –  బతుకమ్మ యనిరంత చందమామ 
పిలుతురదివర నుంచి చందమామ  – ప్రియముగ తలిదండ్రి
బ్రతుకమ్మ యనుపేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ
తాను ధన్యుడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ
నిజపట్టణముకేగి చందమామ – నేల పాలించంగ చందమామ
శ్రీమహావిష్ణుండు చందమామ – చక్రాంకుడనుపేర చందమామ
రాజు వేషంబునా చందమామ – రాజు ఇంటికి వచ్చిచందమామ
ఇల్లింటమని వుండి చందమామ – అతివ బతుకమ్మను చందమామ
పెండ్లాండ్లి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ
ఆరువేల మంది చందమామ  – అతి సుందరాంగులు చందమామ
ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి చందమామ
సిరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరి  చందమామ
జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగవెలిసే చందమామ
 
ఇంటికో తంగేడు చెట్టు
పర్వతగిరి : తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. తొమ్మిది రోజులపాటు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే బతుకమ్మ పండుగలో అన్ని పూలకంటే ప్రధానమైంది తంగేడు పువ్వు. గంగమ్మకు ఇష్టమైన తంగేడు పువ్వు కొన్నేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా లభించడంలేదు. ఈ క్రమంలో పర్వతగిరి మండలంలోని వివిధ  గ్రామాలకు చెందిన మహిళలు కొన్నేళ్ల క్రితం తమ ఇళ్ల ఎదుట తంగేడు చెట్లను పెంచుతున్నారు. దీంతో నాలుగేళ్ల నుంచి మహిళలు పువ్వును కొనుగోలు చేయకుండా ఇంట్లోని చెట్టు పూలనే కోసుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. కొందరు పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement