శ్మశానం పక్కనే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో | poor life odisha people rajamahendravaram | Sakshi
Sakshi News home page

శ్మశానం పక్కనే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో

Published Mon, Feb 27 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

శ్మశానం పక్కనే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో

శ్మశానం పక్కనే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో

దుర్భర జీవితం గడుపుతున్న ఒడిశా వాసులు
రైల్వే స్టేషన్‌లో బొగ్గు దింపుతూ పొట్టపోసుకుంటున్న వైనం
12 ఏళ్ల క్రితం రైల్వేస్టేషన్‌ నుంచి గౌతమినగర్‌ డి–బ్లాక్‌కు తరలింపు
రెండు నెలల్లో ఇళ్లిస్తామన్న నేతలు
2012లో అర్హుల జాబితా సిద్ధం చేసిన తహసీల్దార్‌
అప్పటినుంచీ ఎదురుచూపులతోనే సరి
 
మామూలుగా ఓ కుటుంబం సరైన గాలి, వెలుతురు వచ్చేలా ఇల్లు కట్టుకోవాలంటే  కనీసం 100 గజాల స్థలమైనా ఉండాలి. అలాంటిది.. కేవలం 20 గజాల స్థలంలో.. అది కూడా శ్మశానం పక్కన ఇల్లంటే.. అందులో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లా నుంచి 60 ఏళ్ల క్రితం పొట్ట చేతబట్టుకుని రాజమహేంద్రవరం వచ్చిన వారంతా అటువంటి అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లోనే.. దారుణమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.
 
సాక్షి, రాజమహేంద్రవరం : ఒడిశా నుంచి వచ్చిన వారంతా ఒకప్పుడు రైల్వే స్టేషన్‌ గూడ్స్‌ షెడ్‌ పక్కనే గుడిసెలు వేసుకుని ఉండేవారు. ఆ ప్రాంతాన్ని స్థానికులు ఒడిశాపేటగా పిలిచేవారు. అక్కడ సుమారు 200 కుటుంబాలుండేవి. అక్కడివారంతా రైల్వే స్టేష¯ŒSకు వచ్చే బొగ్గు దింపే పని చేసుకుంటూ జీవించేవారు. 2006లో రైల్వే శాఖ తమ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో వారం రోజులపాటు వారు నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల వద్ద రోడ్డు పైనే ఉన్నారు. చివరికి వారందరినీ హుకుంపేట పంచాయతీ గౌతమీ నగర్‌ డి–బ్లాక్‌కు తరలించారు. అక్కడ శ్మశానం పక్కన ఒక్కో కుటుంబానికి 20 గజాల స్థలం ఇచ్చారు. రెండు నెలల్లో అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని, అప్పటివరకూ అక్కడే ఉండాలని చెప్పారు. ఆ తరువాత క్రమంగా నేతలు, అధికారులు ఈ విషయాన్ని విస్మరించారు. అప్పటినుంచీ వారు అక్కడే 20 గజాల స్థలంలో చిన్న పాకలు వేసుకుని నివసిస్తున్నారు.
కనీస సౌకర్యాలూ కరువు
ఒక్కో కుటుంబంలో చిన్నా పెద్ద కలిపి ఏడుగురున్నా 20 గజాల స్థలంలోనే చాలీచాలని పరిస్థితుల్లో ఒడిశా వాసులు నివసిస్తున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలోనే మురుగు పారుతుంది. ఇక్కడ కనీసం మట్టి రోడ్లు కూడా లేవు. విద్యుత్‌ సౌకర్యం కల్పించకపోవడంతో చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లేందుకు ఆడపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ దీనావస్థపై వారు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్నానం చేసేందుకు కనీస ఏర్పాట్లు చేసుకోలేని ఆర్థిక స్థితి వారిది. దీంతో మహిళలు, ఆడపిల్లలు కూడా ఆరుబయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకస్దిఇ. ఒడిశా పేటగా పిలుస్తున్న ఆ ప్రాంతం వర్షం పడితే ముంపు బారిన పడుతోంది. వర్షం తగ్టిన తర్వాత కూడా దాదాపు వారం రోజుల వరకూ నీరు ఎటూ వెళ్లని పరిస్థితి. నీరు  ఇంకేవరకూ రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది.
2012లో అర్హులను ఎంపిక చేసిన తహసీల్దార్‌
ఒడిశాపేటలో ఒడిశా కుటుంబాలతోపాటు రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన స్థానికులు కూడా ఉన్నారు. చాలామంది ఒడిశా వాసులు స్వస్థలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా 40 కుటుంబాలు మాత్రం గౌతమి నగర్‌కు వెళ్లాయి. వారితోపాటు స్థానిక పేదలు మరో 24 కుటుంబాలవారు వెళ్లారు. వారానికి రెండు రోజులు మాత్రమే ఉండే బొగ్గు దింపు పనే వారికి నేటికీ ఆధారం. నెలకు నాలుగైదు రోజుల పనితో వచ్చే రూ.2 వేలతో వారు జీవనం సాగిస్తున్నారు. మిగిలిన రోజుల్లో స్థానికంగా ఏదైనా పని ఉంటే వెళతారు. ఇక్కడ దుర్భర జీవితం సాగిస్తున్నవారికి ఇళ్లు ఇచ్చేందుకు 2012లో అప్పటి తహసీల్దార్‌ సర్వే చేసి 64 మందిని అర్హులుగా తేల్చారు. పూర్తి వివరాలతో వారి జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే అప్పటినుంచీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఇళ్ల కేటాయింపు జరగలేదు. తమ బతుకులు మార్చాలని నేటికీ ఉన్నతాధికారులు, రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వారికి ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అది ఇంతవరకూ నెరవేరలేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement