కెనడా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి ఈ రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తున్నదని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ నుంచి కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపిస్తున్నన్నట్టు భారత్ ప్రకటించిన నేపధ్యంలో జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెనడా దౌత్యవేత్తల అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని ఆయన ఆరోపించారు. భారత్ చర్య కారణంగా కెనడా, భారతదేశంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సాధారణ జీవితాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేసిందని ట్రూడో పేర్కొన్నారు. ఇది దౌత్య విధానంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్‌లో ఉంటున్న కెనడియన్ల సంక్షేమంపై తనలో ఆందోళన నెలకొన్నదన్నారు.
వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం అక్టోబర్ 19న చేసిన ప్రకటనను గమనించామని, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం గురించి చర్చించామని పేర్కొంది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య అధికంగా ఉందని, అందుకే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా జోక్యం పెరిగిపోయిందని భారత ప్రభుత్వం ఆరోపించింది.
కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడం గురించి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ .. అక్టోబర్ 20 తర్వాత 21 మంది కెనడియన్ దౌత్యవేత్తలు మినహా మిగిలిన దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారతదేశం తెలియజేసిందని అన్నారు. ఈ మేరకే తాము దౌత్యవేత్తలందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారిని భారతదేశం నుండి సురక్షితంగా వెనక్కి పిలిపించామన్నారు. భారత్ చేపట్టిన ఈ చర్యను తాము ఊహించలేదని అన్నారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏ దేశంలోనైనా దౌత్యవేత్తల అధికారాలను ఏకపక్షంగా రద్దు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఇటువంటి చర్య కారణంగా ఏ దౌత్యవేత్త అయినా భారత్‌లో పనిచేయడం కష్టమని అన్నారు.
అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, గత నెల రోజులుగా ఈ అంశంపై కెనడా ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపింది. ఈ నిర్ణయాలు వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1కు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దౌత్యవేత్తల విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలనే నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భారత్ పరిగణించదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
Comments
Please login to add a commentAdd a comment