ఇక బ్యాంకు ఏటీఎం నుంచి ‘తపాలా’ నగదు!
- డ్రా చేయడానికి వీలుగా బ్యాంకులతో పోస్టల్ అనుసంధానం
- శరవేగంగా ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు
- వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి సరికొత్త సేవలు
- డబ్బు డ్రా చేసుకునేందుకు పోస్టాఫీసుకు వెళ్లనక్కరలేదు
సాక్షి, హైదరాబాద్: మరికొద్ది నెలల్లో బ్యాంకు హోదా పొందబోతున్న తపాలాశాఖ అంతకుముందే ఖాతాదారులకు విస్తృతమైన ‘బ్యాం కింగ్’ సదుపాయాలు అందుబాటులోకి తేబోతోంది. పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు నేరు గా బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు పొందే అవకాశం త్వరలో కలగబోతోంది. అంటే ఏ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం నుంచైనా తపాలా ఖాతాదారులు నగదు డ్రా చేసుకోవచ్చన్నమాట. ఈ మేరకు బ్యాంకులతో తపాలాశాఖ తన ఖాతాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానిస్తోంది. ఇప్పటివరకు ఈ అనుసంధానం కేవలం బ్యాంకుల మధ్యనే ఉంది. అందులోకి ఇప్పుడు తపాలాశాఖ కూడా ప్రవేశిస్తోంది. ఇంతకాలం తపాలా ఖాతాదారులు నగదును కేవలం పోస్టాఫీసుల్లో మాత్రమే పొందే వీలు ఉండేది.
తపాలా ఏటీఎంల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపినా అవి విస్తృతంగా ఏర్పాటు కావటానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తపాలాశాఖ ఏపీ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) పరిధిలో కేవలం ఆరు పోస్టల్ ఏటీఎంలు మాత్రమే ఏర్పాటయ్యాయి. దీంతో తపాలా ఖాతాదారులు నగదు డ్రా చేసుకోవటానికి పోస్టాఫీసుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఏటీఎంల ద్వారా సులభంగా నగదు పొందే పద్ధతికి అలవాటుపడ్డ ప్రజలు.. పోస్టల్ తీరుతో కొంత అసహనానికి గురవుతున్నారు. దీనిపై పోస్టాఫీసుల్లో భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని గుర్తించిన ఆ శాఖ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులతో ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం అవుతోంది. ఫలితంగా పోస్టల్ ఖాతాదారులు కూడా సాధారణ బ్యాంకు ఏటీఎంలను వినియోగించుకునేందుకు మార్గం సుగ మం అవనుంది. దీంతో తపాలా ఖాతాల సం ఖ్య కూడా పెరుగుతుందని, అది పోస్టల్‌కు బాగా కలిసివచ్చే అంశమని ఆ శాఖ భావి స్తోంది. ప్రస్తుతం తపాలాశాఖ ఏపీ సర్కిల్ పరిధిలో దాదాపు 3 కోట్లకుపైగా పొదుపు ఖాతాలున్నాయి. వీటిని రెట్టింపు చేసే లక్ష్యం నిర్ధారించుకున్న ఆ శాఖకు ఈ కొత్త నిర్ణయం అనుకూలంగా మారే అవకాశం ఉంది.
వేగంగా ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు
బ్యాంకు ఏటీఎంల నుంచి తపాలా ఖాతాదారులు నగదు పొందాలంటే ముందుగా ఆయా బ్యాంకులతో పోస్టాఫీసుల అనుసంధానం జరగాలి. అది కావాలంటే తొలుత పోస్టాఫీసులన్నింటిని ఆన్‌లైన్‌తో పరస్పరం అనుసంధానించాలి. ఇప్పటి వరకు కేవలం హెడ్ పోస్టాఫీసులను మాత్రమే ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. తాజాగా సబ్ పోస్టాఫీసుల అనుసంధానం కూడా ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా తపాలాశాఖ శరవేగంగా సబ్‌పోస్టాఫీసుల అనుసంధానం పూర్తి చేస్తోంది. ఇప్పటివరకు ఏపీ సర్కిల్ పరిధిలో 95 హెడ్‌పోస్టాఫీసులు, 300 సబ్ పోస్టాఫీసులు ఆన్‌లైన్ పరిధిలోకి వచ్చాయి. వచ్చే మార్చి నాటికి మరో 1,800 సబ్‌పోస్టాఫీసులకు ఈ వసతి కల్పించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటైతే ఒక పోస్టాఫీసు ఖాతాలోని డబ్బులను మరే తపాలా కార్యాలయం నుంచైనా పొందే అవకాశం కలుగుతుంది. మరోవైపు బ్యాంకులతో వెంటనే అనుసంధానించే పని కూడా జరుగుతుంది. అప్పుడు పోస్టాఫీసుల ఖాతాల వివరాలు బ్యాంకులకు చేరతాయి. తద్వారా వాటి ఏటీఎంల నుంచి డబ్బు పొందే అవకాశం అందుబాటులోకి వస్తుంది.