త్వరలో పోస్టుల భర్తీ
జేఎన్‌టీయూ వీసీ ఆచార్య సర్కార్
డిసెంబర్‌లోగా కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు
పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ–అనంతపురం పరిధిలో వచ్చే నెల మొదటి వారంలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వీసీ ఆచార్య ఎం.ఎం.ఎం.సర్కార్ తెలిపారు. వైస్ చాన్స్‌లర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సాక్షితో మాట్లాడుతూ... బోధన పోస్టుల కొరతను అధిగమించేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి నవంబర్ 2న జరిగే పాలక మండలి సమావేశంలో ఆమోదం పొందనున్నట్లు తెలిపారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్, మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిర్ధారిస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.300 కోట్లతో కలికిరిలో భవనాల నిర్మాణం
కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి రూ.300 కోట్ల వ్యయంతో ఆధునాతన భవనాలు పూర్తి అయినట్లు వీసీ సర్కార్ తెలిపారు. ఈ భవనాలను డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. జేఎన్‌టీయూ అనంతపురంలో ఆడిటోరియం ఆధునీకరణకు రూ. 1.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించే స్నాతకోత్సవాలకు ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి చేస్తామన్నారు. తొలి విడతగా 200 కిలో వాట్‌ల సోలార్ విద్యుదుత్పతిక్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఆదాకు ఎల్‌ఈడీ బల్బులు వినియోగించనున్న నేపథ్యంలో వీటి సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామన్నారు. రూ.72 కోట్ల వ్యయంతో నాలుగు భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
క్యాంపస్ ఇంటర్వ్యూల మెరుగుకు కషి
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపిక కావడానికి తగిన కషి చేస్తున్నామన్నారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలో 85 శాతం నుంచి 90 శాతం క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపికవుతున్నారన్నారు. అనుబంధ కళాశాలల్లో 20 శాతం నమోదవుతోందన్నారు. గతేడాది 170 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్‌డీ అవార్డులు ఇచ్చామన్నారు. పరీక్షల విభాగంలో ఆన్‌లైన్ ప్రక్రియ విధానం ప్రవేశపెట్టామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో నూతనంగా వీఎల్‌ఎస్‌ఐ, ఎంబీడెడ్ సిస్టమ్ , కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ , అడ్వాన్స్‌డ్ మ్యాన్‌ఫ్యాక్చురింగ్ సిస్టమ్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు.