సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్‌ఎస్ సర్కారుదని ఆరోపించారు.
ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్‌లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు.
మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్‌లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్‌పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment