కాన్పుకొచ్చి .. కానరాని లోకాలకు..
• సిజేరియన్ అనంతరం పరిస్థితి విషమం
• చికిత్స పొందుతూ బాలింత మృతి
అనంతపురం సిటీ : కాన్పు కోసం వచ్చిన ఓ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చి కానరానికి లోకాలకు వెళ్లింది. భూమ్మీద అడుగు పెట్టిన కొద్ది గంటల్లోనే తల్లిని కోల్పోయిన ఆ శిశువును చూసి ప్రతి ఒక్కరూ అయ్యో..పాపం అంటూ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన అనంతపురం సర్వజనాస్పత్రిలో జరిగింది.
ఎలా జరిగిందంటే...
గుత్తి మండలం బేతపల్లికి చెందిన మాధవి(21) వివాహం పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన రామాంజినేయులుతో జరిగింది. మొదటి కాన్పులో మగ బిడ్డకు మాధవి జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 14(ఆదివారం)న ఉదయం చేర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు సిజెరీయన్ చేసి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
అదే రాత్రి 9 గంటలకు మాధవికి మూర్ఛ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రాత్రంతా మూర్చ రావడంతో కుట్లు తెగిపోయాయని వైద్యులు తమకు చెప్పినట్లు మాధవి బంధువులు అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మాధవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతికి దారి తీసిన కారణాలపై కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లేదు. కాన్పు వరకు బాగున్న మాధవి రాత్రికి రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. శిశువును తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు.
వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
అనంతపురం రూరల్ పరిధిలోని చంద్రబాబు కొట్టాలకు చెందిన ఓ మహిళ కాన్పు అనంతరం మృతి చెందింది. ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ నేతలు ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా గడవకనే మరో తల్లి చికిత్స పొందుతూ మృతి చెందడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అయినా ఉన్నతాధికారులు పట్టించకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.