రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు | Preparations on full swing for Rottela pandaga | Sakshi
Sakshi News home page

రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు

Published Wed, Oct 5 2016 1:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు - Sakshi

రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు

  • 10 లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా
  • భక్తులకు మజ్జిగ, నీళ్ల పంపిణీకి ప్రభుత్వ ఆదేశం 
  • ఈ సారి రూ.కోటికి పైగానే కార్పొరేషన్‌కు భారం
  • అదనంగా రూ.1.40 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని కార్పొరేషన్‌ మీద ఒత్తిడి
  • ఈ ఖర్చు సుమారు రూ.80 లక్షలు
  • రూ.16 లక్షలు వక్ఫ్‌ సాయం
  •  
    సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
    నెల్లూరులో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి 10 లక్షలకు పైగా జనం హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. పండగ ఏర్పాట్ల ఖర్చు రూ.కోటితో పాటు స్వర్ణాల చెరువుకు శాశ్వతంగా ఘాట్లు నిర్మించేందుకు జరుగుతున్న పనికి సంబంధించి రూ.1.40 కోట్లు కార్పొరేషన్‌ నెత్తిన భారం మోపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అసలే నిధులు లేవని అల్లాడుతున్న కార్పొరేషన్‌ వర్గాలు ఈ బిల్లులు తాము చెల్లించలేం మహాప్రభో అని బావురుమంటున్నాయి. ఇదిలా ఉండగా  రొట్టెల పండగను ఈ సారి భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పించే బాధ్యత మాత్రం యథాతథంగానే కార్పొరేషన్‌ మీద మోపింది.  ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమోనని ఎదురు చూసిన అధికారులు ఇక లాభం లేదనుకుని 15 రోజుల నుంచి పనులు ప్రారంభించారు. 
    శాశ్వత ఏర్పాట్లు
    కేవలం రొట్టెల పండగ సమయంలోనే కాకుండా ఏడాది మొత్తం నెల్లూరు వాసులకు వినోదం, ఆహ్లాదం కల్పించడానికి చెరువుకు ఘాట్ల నిర్మాణం, మొక్కల పెంపకం, జనం కూర్చోవడానికి అనువుగా సదుపాయాలతో శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.2.60 కోట్లు ఇచ్చింది.  దర్గా, చెరువుకు వచ్చే జనానికి సౌకర్యంగా ఉండేదు కోసం భూమి చదును, 120 శాశ్వత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భక్తులకు నీడ కల్పించడం కోసం షెడ్లు, అలకరణలో భాగంగా ఆర్చిలు నిర్మిస్తున్నారు. బారాషహీద్‌ దర్గాకు వక్ఫ్‌బోర్డు రంగులు వేయింస్తోంది.
    భక్తులకు మజ్జిగ, నీళ్లు పంపిణీ
    రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరికీ మజ్జిగ, నీళ్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం  సుమారు రూ.80 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు భక్తులకు వినోదం కల్పించడం కోసం ఈ సారి ఖవ్వాలి ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. రూ.18.90 లక్షలతో విద్యుత్‌ అలంకరణలు, మూడు పార్కింగ్‌ ప్రదేశాల్లో  రూ.12 లక్షలతో 100 మొబైల్‌ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాకు రూ.20 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. 
    వక్ఫ్‌ రూ.16 లక్షల సాయం
     గత ఏడాది రొట్టెల పండగకు కార్పొరేషన్‌కు రూ.15 లక్షలు ఇచ్చిన వక్ఫ్‌బోర్డు ఈసారి రూ.16 లక్షలు అందించనుంది. గతేడాది రూ.10 లక్షలు అందించిన పర్యాటక శాఖ ఈ సారి తామే ఏర్పాట్లు చేస్తున్నందువల్ల ఆర్థికంగా సహకారం అందించలేమని తేల్చింది. గత ఏడాది నిర్వహించిన టెండర్‌లో రూ.60 లక్షలు ఆదాయం వచ్చినందువల్ల ఇందులో నుంచి ఈ సారి రూ.40 లక్షలు తమకు చెల్లించాల్సి ఉందని కార్పొరేషన్‌ వర్గాలు వక్ఫ్‌ బోర్డును కోరాలని నిర్ణయించాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.3 కోట్లు అడిగేందుకు నిర్ణయం తీసుకున్నారు.
    పుండు మీద కారం
    రొట్టెల పండగ నిర్వహణ కోసం అవసరమయ్యే రూ.కోటి భరించడమే ఇబ్బందిగా ఉన్న కార్పొరేషన్‌ మీద మరో రూ.1.40 కోట్లు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్వర్ణాల చెరువు అభివృద్ధి, ఘాట్ల నిర్మాణానికి రూ.4 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ​‍ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి తమ వంతుగా రూ.2.60 కోట్లు ఇచ్చింది. మిగిలిన రూ.1.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాలని సూచించింది. అయితే కాంట్రాక్టరు పనులు వేగంగా చేస్తూ బిల్లుల కోసం కార్పొరేషన్‌ అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మంత్రితో కూడా సిఫారసు చేయించారు. కాగా రూ.1.40 కోట్లు తాము ఇవ్వలేమని కార్పొరేషన్‌ వర్గాలు తేల్చి చెప్పాయి. 
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement