ఫ్యాక్టరీల్లో ప్రమాదాలను అరికట్టాలి: నాయిని
హైదరాబాద్: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. క్లస్టర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు వృత్తిపరంగా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేలుళ్ల బారి నుంచి రక్షణ తదితర అంశాలపై బుధవారం రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్ కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో శిక్షణ శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా నాయిని హాజరై శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 528 క్లస్టర్ ఫ్యాక్టరీలున్నాయి. వాటిలో సిలికా, ఇసుక వాడటం వల్ల కార్మికులు విపరీతమైన దుమ్ము, పొగ, భారీ శబ్దాలతో సహవాసం చేస్తూ అనారోగ్యాలకు గురవుతుంటారు. కార్మికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు బలైపోతుంటారు.
దీర్ఘకాలికమైన వ్యాధుల్లో శ్వాసకోశ వ్యాధులు అధిక ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాధుల బారిన పడిన కార్మికులకు వైద్య పరీక్షలు చేయించాల్సిన బాధ్యత చట్టపరంగా ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలదే. కంకర మిషన్లు, గ్రానైట్ తయారీ మిషన్ల వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన చెప్పారు.
కార్మికులను తొలగించడం దుర్మార్గం
రాజ్యాంగ పరంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మికులందరితో ఒక యూనియన్‌ను స్థాపించుకునే అవకాశం ఉందని నాయిని అన్నారు. చైతన్యవంతులైన కార్మికులు యూనియన్లను ఏర్పాటు చేసుకుంటే వారిని నిర్దాక్షిణంగా, మానవత్వం లేకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే కార్మికులను తొలగించడం దుర్మార్గమని, తొలగించిన యాజమాన్యాలపై ఎంత టి కఠిన చర్యలు తీసుకున్నా తప్పు లేదని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును కల్పించిందని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
కార్యక్రమంలో ఈఎస్‌ఐ జాయింట్ డెరైక్టర్ పద్మ, పరిశ్రమల శాఖ ఇన్‌ఛార్జి కిషన్ తదితరులు పాల్గొన్నారు. గనులు, ఫ్యాక్టరీ కార్మికులకు ప్రమాదాలు జరగకుండా వినియోగించే పరికరాలు, ప్రమాదాలకు గురైతే చేపట్టే వైద్య సేవల పనిముట్ల ప్రదర్శనను నాయిని ప్రారంభించారు. బండరాళ్ల పేలుళ్ల నుంచి ప్రాణ రక్షణ పొందడం, డిటోనేటర్లను పేల్చడం తదితర అంశాలపై శ్రీకాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే గనుల్లో సంభవించిన పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో ప్రశాంత్ మానుకర్ వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు పొందాల్సిన వైద్యసేవల వివరాలను డాక్టర్ పి.వి.రావు తెలిపారు.