‘ప్రైవేటు’ రిజర్వేషన్లూ సాధిద్దాం
‘ప్రైవేటు’ రిజర్వేషన్లూ సాధిద్దాం
Published Wed, Nov 2 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ
అమలాపురం టౌన్ : దళితులు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగితే హక్కుల సాధనే కాదు..ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను సాధించుకోవచ్చని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ప్రైవేటు రిజర్వేషన్లకు కృషి చేద్దామని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కోనసీమ ప్రాంత దళిత ముఖ్య నాయకులతో స్థానిక కాటన్ అతిథిగృహంలో బుధవారం ఉదయం నిర్వహించిన సభకు శివాజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని ఖచ్చితంగా అమలు పరిచేందుకు, దళిత గిరజనులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని శివాజీ అన్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరంలోని ఆరŠట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దళిత గిరజనుల మహాగర్జన భారీ బహిరంగ సభకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందన సభను కూడా ఇదే వేదికపై ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే ఈ సభలో ఆయనను దళితులు, గిరిజనుల తరఫున సత్కరిస్తామని చెప్పారు. అనంతరం దళిత గిరజన మహాగర్జన సభ పోస్టర్లు, బ్రోచర్లను శివాజీ, దళిత నాయకులు విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, కోనసీమ దళిత నాయకులు జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, నాగాబత్తుల శ్రీనివాసరావు, బొంతు బాలరాజు, పెనుమాల చిట్టిబాబు, కుసుమ సూర్యమోహనరావు, దేవరపల్లి శాంతికుమార్, ఉండ్రు బుల్లియ్య, కాశి వెంకట్రావు ప్రసంగించారు.
Advertisement