అధ్యక్షా... ఇదీ మా గోడు
మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు
పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం
భయపెడుతున్న కోతులు, కుక్కలు
మితిమీరుతున్న సిబ్బంది అవినీతి
నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం
వరంగల్ అర్బన్ : వరంగల్ నగర ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. సత్వర సేవలు అందడం లేదు. విలీన గ్రామాలను పూర్తిగా విస్మరించారు. సిటిజన్ చార్టర్ అమలు కావడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలపై ప్రతివారం ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు అందజేస్తున్నారు. కోతులు, కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ›పలు సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్.
మహా నగరంలో చాలా కాలనీల్లో కనీస మౌలిక వసతుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 30 శాతం కాలనీల్లో ఇంకా డ్రెయినేజీలు లేవు. అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నల్లా నీళ్లు కచ్చితంగా వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రెండో రోజులకోమారు సరఫరా అంటున్నారు. వాస్తవంగా పరిశీలిస్తే ఇది అమలు కావడం లేదు.
పారిశుద్ధ్యం అ««ధ్వానం
మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇంటింటా చెత్త సేకరణ, మురుగు కాలువల పుడికతీత నామామాత్రంగానే సాగుతోంది. ప్రధాన రహదారులను ఊడ్చుతూ సరిపెడుతున్నారు. పారిశుద్ధ్య విభాగం సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. దోమల పెరిగిపోయాయి. దోమల నివారణకు ఏటా రూ.50 నుంచి 60 లక్షల సొమ్ము ఖర్చువుతోంది. కానీ దోమల బారి నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారు.
కోతులు, కుక్కలతో పారేషాన్... కోతులు, కుక్కలు ప్రజలను ముప్పుతిప్పలుపెడుతున్నారు. కోతులు ఇళ్లల్లోకి చొరబడి భీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి నుంచి కాపాడే నాథుడే కరువయ్యారు. కుక్కలు గుంపులు గుంపులు వెంబడించి గాయాల పాలు చేస్తున్నాయి. కుక్కల ఆపరేషన్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం కానరావడం లేదు.
రహదారులతో నడుము హూనమే.... మహా నగరంలోని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. పెద్ద గుంతలతో ప్రజలు పారేషన్ అవుతున్నారు. వాహనాలు దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారుల శాఖ, ఆర్‌అండ్‌బీ, గ్రేటర్ వరంగల్ శాఖల అధికారులు రోడ్ల మరమ్మతుల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కదలని ఫైళ్లు, మితిమీరిన అవినీతి
ఈ–ఆఫీస్ ద్వారా ఫైళ్లు కదలడం లేదు. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సి వస్తోందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైసలు ఇస్తేనే సకాలంలో పనులు అవుతున్నాయి. లేదంటే కోర్రిల పేరుతో నెలనెల తరబడి తిప్పుకుంటున్నారు. పన్నుల విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం విభాగాల్లో అవినీతి మితిమీరిపోయింది.