వీసీ సాయన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న అకుట్ అధ్యక్షుడు దయాకర్
కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. 2014 మే 17న కేయూ వీసీగా ప్రొఫెసర్ వెంకటరత్నం పదవీకాలం ముగిశాక ఇప్పటి వరకు నలుగురు ఇన్‌చార్జి వీసీలుగా పనిచేశారు.
-
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
-
ఎట్టకేలకు రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ నియామకం
-
రెండు సంవత్సరాలుగా ఇన్‌చార్జుల పాలనలో యూనివర్సిటీ
కేయూ క్యాంపస్ :కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. 2014 మే 17న కేయూ వీసీగా ప్రొఫెసర్ వెంకటరత్నం పదవీకాలం ముగిశాక ఇప్పటి వరకు నలుగురు ఇన్‌చార్జి వీసీలుగా పనిచేశారు. నాల్గవ ఇన్‌చార్జీ వీసీగా టి.చిరంజీవులు గత సంవత్సర కాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కేయూకు రెగ్యులర్ వీసీని నియమాకం చేసింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్.సాయన్న 1955 అగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కేయూలో మూడు సంవత్సరాలపాటు వీసీగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
జూనియర్ కళాశాల లెక్చరర్ నుంచి..
సాయన్న ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 26 సంవత్సరాల బోధన పరిశోధనానుభవం కలిగిన ప్రొఫెసర్ సాయన్న ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఆరెళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1991నుంచి 1999వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కొద్దికాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్‌డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో భోధన చేశారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్‌డీ చేస్తున్నారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ఆయన పాల్గొన్నారు. పలు పరిశోధనాపత్రాలను సమర్పించారు.
పరిపాలనా పదవులు ఇలా..
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000వరకు బాధ్యతలను నిర్వర్తించారు. సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్‌గా 1991లో పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. అకాడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా పనిచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యుడుగాను, సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ సాలీడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడుగాను పనిచేశారు.
యూనివర్సిటీ అభివృద్దికి కృషిచేస్తా
కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషిచేస్తాన ని వీసీ ప్రొఫెసర్ సాయన్న అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ వీసీగా బాధ్యతలను స్వీకరించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను వీసీ స్థాయికి చేరినందుకు తన తల్లిదండ్రులకు రుణపడిఉంటానన్నారు. నిరక్ష్యరాస్యులైన తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తాను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించారని చెప్పారు. తనమీద నమ్మకంతో కేయూకు వీసీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.