బె‘లూన్’ ఇంటర్నెట్!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో ఉన్న కంప్యూటర్.. వైఫై.. ఇలా రకరకాల మార్గాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇదెంత సౌకర్యంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.. అయితే ప్రపంచంలో నెట్ అనుసంధానం లేని దాదాపు 370 కోట్ల మందికి కూడా నెట్ అందించేందుకు గూగుల్ ఓ సరికొత్త ప్రాజెక్టు చేపట్టింది. దీని పేరే.. ‘ప్రాజెక్టు లూన్’. ఇందులో హీలియం గాలి నింపిన భారీ సైజు బెలూన్లను భూమిచుట్టూ తిప్పుతూ, వాటికి అనుసంధానించిన పరికరాల ద్వారా ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న వారికైనా నెట్ సౌకర్యం అందించవచ్చు.
ఇలా పనిచేస్తుంది..
ఈ బెలూన్లు భూమిపై నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూంటాయి. విమానాలు ప్రయాణించే దానికన్నా రెట్టింపు ఎత్తు అన్నమాట. ఈ ప్రాంతంలో గాలి పొరలు పొరలుగా ఉండటమే కాకుండా వేగం, దిశ ఒక్కో రీతిలో ఉంటుంది. ఈ పొరల్లో బెలూన్లు పైకి, కిందకు కదులుతూ గాలివాటానికి కొట్టుకుపోతూ ఓ చోటు నుంచి మరో చోటుకు చేరుకుంటాయి. ఒక్కో బెలూన్ దాదాపు 36 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి గాల్లో వందరోజులపాటు గాల్లో ఎగరగలవు. బెలూన్లకు దిగువభాగంలో సోలార్ ప్యానెల్స్, ఇంటర్నెట్ సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగపడే పరికరాలను ఏర్పాటు చేస్తారు. సెల్‌ఫోన్ కంపెనీలు తమ రేడియో ఫ్రీక్వెన్సీలో కొంతభాగాన్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయిస్తాయి. సంకేతాలను అందుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని భవనాలపై అక్కడక్కడ రిసీవర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెలూన్ ద్వారా దాదాపు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సెల్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్‌ను అందుకునే అవకాశముంటుంది.
న్యూజిలాండ్‌లో ప్రయోగాలు..
ఈ ప్రాజెక్టును రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌లో గూగుల్ విజయవంతంగా పరీక్షించి చూసింది. ముందుగా దాదాపు 30 బెలూన్లను ఆకాశంలోకి పంపి కొందరికి ఇంటర్నెట్ సౌకర్యం అందించగలిగారు. ఆ తరువాత మరింత ఎక్కువ ప్రాంతాన్ని, వినియోగదారులను చేర్చారు. అంతేకాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, సెంట్రల్‌వ్యాలీ, బ్రెజిల్‌లోని కొన్ని చోట్ల జరిపిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. అవసరమైన కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే గూగుల్ త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో భారత్‌లోనూ ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశముంది. బీఎస్‌ఎన్‌ఎల్ అధీనంలోని 2.6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మొబైల్ టవర్ల అవసరం లేకుండానే 4జీ ఇంటర్నెట్‌ను అందుకోవచ్చు.