Project Loon
-
గూగుల్ బెలూన్ కూలిపోయింది
కొలంబో: గూగుల్ ఇంటర్నెట్ బెలూన్ శ్రీలంకలో కూలిపోయింది. హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం చేపట్టిన 'ప్రాజెక్టు లూన్' ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారుచేశారు. శ్రీలంకలో దీన్ని తొలిసారిగా ప్రయోగించారు. అయితే ఈ భారీ బెలూన్ తేయాకు తోటల్లో కూలిపోయిందని స్థానిక పోలీసులు గురువారం వెల్లడించారు. గంపాలా ప్రాంతంలో తేయాకు తోటల్లో కూలిపోయిన బెలూన్ స్థానికులు గుర్తించారని చెప్పారు. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారని ఏఎప్ఫీ వార్తా సంస్థ వెల్లడించింది. గూగుల్ బెలూన్ కూలిపోయిందన్న వార్తను శ్రీలంక సమాచార, సాంకేతిక విభాగం తోసిపుచ్చింది. నియంత్రిత ప్రదేశంలో, నిర్దేశించిన ప్రదేశంలో బెలూన్ దిగిందని తెలిపింది. గూగుల్ బెలూన్ సురక్షితంగా దిగిందని పేర్కొంది. ఇంటర్నెట్ స్పీడును బెలూన్ల ద్వారా విస్తరించేందుకు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు 'ప్రాజెక్ట్ లూన్'ను గూగుల్ చేపట్టింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. -
బె‘లూన్’ ఇంటర్నెట్!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో ఉన్న కంప్యూటర్.. వైఫై.. ఇలా రకరకాల మార్గాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇదెంత సౌకర్యంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.. అయితే ప్రపంచంలో నెట్ అనుసంధానం లేని దాదాపు 370 కోట్ల మందికి కూడా నెట్ అందించేందుకు గూగుల్ ఓ సరికొత్త ప్రాజెక్టు చేపట్టింది. దీని పేరే.. ‘ప్రాజెక్టు లూన్’. ఇందులో హీలియం గాలి నింపిన భారీ సైజు బెలూన్లను భూమిచుట్టూ తిప్పుతూ, వాటికి అనుసంధానించిన పరికరాల ద్వారా ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న వారికైనా నెట్ సౌకర్యం అందించవచ్చు. ఇలా పనిచేస్తుంది.. ఈ బెలూన్లు భూమిపై నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూంటాయి. విమానాలు ప్రయాణించే దానికన్నా రెట్టింపు ఎత్తు అన్నమాట. ఈ ప్రాంతంలో గాలి పొరలు పొరలుగా ఉండటమే కాకుండా వేగం, దిశ ఒక్కో రీతిలో ఉంటుంది. ఈ పొరల్లో బెలూన్లు పైకి, కిందకు కదులుతూ గాలివాటానికి కొట్టుకుపోతూ ఓ చోటు నుంచి మరో చోటుకు చేరుకుంటాయి. ఒక్కో బెలూన్ దాదాపు 36 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి గాల్లో వందరోజులపాటు గాల్లో ఎగరగలవు. బెలూన్లకు దిగువభాగంలో సోలార్ ప్యానెల్స్, ఇంటర్నెట్ సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగపడే పరికరాలను ఏర్పాటు చేస్తారు. సెల్‌ఫోన్ కంపెనీలు తమ రేడియో ఫ్రీక్వెన్సీలో కొంతభాగాన్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయిస్తాయి. సంకేతాలను అందుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని భవనాలపై అక్కడక్కడ రిసీవర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెలూన్ ద్వారా దాదాపు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సెల్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ను అందుకునే అవకాశముంటుంది. న్యూజిలాండ్‌లో ప్రయోగాలు.. ఈ ప్రాజెక్టును రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌లో గూగుల్ విజయవంతంగా పరీక్షించి చూసింది. ముందుగా దాదాపు 30 బెలూన్లను ఆకాశంలోకి పంపి కొందరికి ఇంటర్నెట్ సౌకర్యం అందించగలిగారు. ఆ తరువాత మరింత ఎక్కువ ప్రాంతాన్ని, వినియోగదారులను చేర్చారు. అంతేకాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, సెంట్రల్వ్యాలీ, బ్రెజిల్‌లోని కొన్ని చోట్ల జరిపిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. అవసరమైన కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే గూగుల్ త్వరలోనే బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత్‌లోనూ ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశముంది. బీఎస్ఎన్ఎల్ అధీనంలోని 2.6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మొబైల్ టవర్ల అవసరం లేకుండానే 4జీ ఇంటర్నెట్ను అందుకోవచ్చు. -
భారత్‌లో గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్’పై కసరత్తు
న్యూఢిల్లీ: భారీ బెలూన్ల సహాయంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వంతో ఇంటర్నెట్ సంస్థ గూగుల్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీని న్యూజిలాండ్, బ్రెజిల్ తదితర దేశాల్లో గూగుల్ దీన్ని పరీక్షించింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన ప్రభుత్వం, దీన్ని అమలు చేయదగిన ప్రాంతాలు ఇతర విధివిధానాలపై మరింత కసరత్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు బీఎస్ఎన్ఎల్తో గూగుల్ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించాయి. గూగుల్ టెక్నాలజీని మాత్రమే అందించవచ్చని, నెట్ సర్వీసు ప్రొవైడర్‌గా ఉండకపోవచ్చని తెలిపాయి. మరోవైపు డ్రోన్ల సహాయంతో కూడా నెట్ సదుపాయం అందించేందుకు ఉద్దేశించిన గూగుల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వివరించాయి. భూఉపరితలానికి 20 కిలోమీటర్ల పైన ఉండే ఒక్కో భారీ బెలూన్.. 4జీ టెక్నాలజీ సాయంతో సుమారు 40 కిలోమీటర్ల మేర నెట్ సదుపాయం కల్పించగలదని అంచనా. ఈ బెలూన్లలోని ఉపకరణాలకు నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా గూగుల్ విండ్, సోలార్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది.