గూగుల్ బెలూన్ కూలిపోయింది
కొలంబో: గూగుల్ ఇంటర్నెట్ బెలూన్ శ్రీలంకలో కూలిపోయింది. హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం చేపట్టిన 'ప్రాజెక్టు లూన్' ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారుచేశారు. శ్రీలంకలో దీన్ని తొలిసారిగా ప్రయోగించారు. అయితే ఈ భారీ బెలూన్ తేయాకు తోటల్లో కూలిపోయిందని స్థానిక పోలీసులు గురువారం వెల్లడించారు. గంపాలా ప్రాంతంలో తేయాకు తోటల్లో కూలిపోయిన బెలూన్ స్థానికులు గుర్తించారని చెప్పారు. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారని ఏఎప్ఫీ వార్తా సంస్థ వెల్లడించింది.
గూగుల్ బెలూన్ కూలిపోయిందన్న వార్తను శ్రీలంక సమాచార, సాంకేతిక విభాగం తోసిపుచ్చింది. నియంత్రిత ప్రదేశంలో, నిర్దేశించిన ప్రదేశంలో బెలూన్ దిగిందని తెలిపింది. గూగుల్ బెలూన్ సురక్షితంగా దిగిందని పేర్కొంది.
ఇంటర్నెట్ స్పీడును బెలూన్ల ద్వారా విస్తరించేందుకు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు 'ప్రాజెక్ట్ లూన్'ను గూగుల్ చేపట్టింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.