భారత్‌లో గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్’పై కసరత్తు
న్యూఢిల్లీ: భారీ బెలూన్ల సహాయంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వంతో ఇంటర్నెట్ సంస్థ గూగుల్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీని న్యూజిలాండ్, బ్రెజిల్ తదితర దేశాల్లో గూగుల్ దీన్ని పరీక్షించింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన ప్రభుత్వం, దీన్ని అమలు చేయదగిన ప్రాంతాలు ఇతర విధివిధానాలపై మరింత కసరత్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత్‌లో ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌తో గూగుల్ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించాయి. గూగుల్ టెక్నాలజీని మాత్రమే అందించవచ్చని, నెట్ సర్వీసు ప్రొవైడర్‌గా ఉండకపోవచ్చని తెలిపాయి. మరోవైపు డ్రోన్‌ల సహాయంతో కూడా నెట్ సదుపాయం అందించేందుకు ఉద్దేశించిన గూగుల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వివరించాయి.
భూఉపరితలానికి 20 కిలోమీటర్ల పైన ఉండే ఒక్కో భారీ బెలూన్.. 4జీ టెక్నాలజీ సాయంతో సుమారు 40 కిలోమీటర్ల మేర నెట్ సదుపాయం కల్పించగలదని అంచనా. ఈ బెలూన్లలోని ఉపకరణాలకు నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా గూగుల్ విండ్, సోలార్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది.