అర్ధనగ్నంగా నిర్వాసితుల రాస్తారోకో
అర్ధనగ్నంగా నిర్వాసితుల రాస్తారోకో
Published Sun, Sep 4 2016 10:58 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
నెల్లిపాక : పోలవరం నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతోంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో రెండు వారాలుగా నెల్లిపాకలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం జాతీయ రహదారిపై నిర్వాసితులు అర్ధనగ్నంగా బైఠాయించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల నాయకుడు కందుకూరి మంగరాజు మాట్లాడుతూ ముంపు బాధితులు న్యాయం కోసం దీక్షలు చేపడితే, కనీసం ప్రభుత్వం స్పం దించడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తున్న ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ముంపు బాధితులకు మెరుగైన ప్యాకేజి, పునరావాసం కల్పించాకే ప్రాజెక్ట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బొల్లా సత్యం, కరి శ్రీను, నాగరాజు, పూసం రాఘవయ్య, రత్నాకర్ పాల్గొన్నారు.
Advertisement