తూర్పుగోదావరి: కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ముద్రగడకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు దీక్షలు చేపడుతున్నారు. ఆయన నివాసానికి పోలీసులు ప్రజలను అనుమతించడం లేదు. ముద్రగడ దంపతులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంచాలు, చెంచాలతో శబ్ధం చేస్తూ కాపులు ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం, బోడపాటివారిపాలెంలో భారీగా కాపు మహిళలు దీక్షలు చేపడుతున్నారు. కంచాలు, గంటెలతో శబ్ధం చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నారు. మేడపాడులో కాపు మహిళలు ముద్రగడ దీక్షకు సంఘీభావంగా ఒక్క పూట భోజనం మానేసి కంచాలు, గరిటలతో రోడ్డుపై బైఠాయించారు. కోనసీమలోని అన్ని మండల కేంద్రాలలో సంఘీభావ దీక్షలతో కాపులు కదంతొక్కారు.
రాజమహేంద్రవరం లోని కోటగుమ్మం సెంటర్‌లో శుక్రవారం మధ్యాహ్నం కంచాలు గంటెలతో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.