విజయవాడ : నగరంలోని కేఎల్‌రావు నగర్‌లో ఇంటర్ విద్యార్థిని రాయపురెడ్డి అనిత ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా కేఎల్‌రావునగర్ 8వ లైన్‌కు చెందిన రాయపురెడ్డి అనిత(16) గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో ఇంటర్ చదువుతుంది. ఆమె తండ్రి ప్రసాద్ వస్త్రలత వద్ద చెరకు రసం విక్రయిస్తుంటాడు. తల్లి ఈశ్వరి వంటలు చేస్తుంటుంది.
సోమవారం సాయంత్రం కాలేజీ నుంచి కేఎల్‌రావునగర్ వచ్చేందుకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ బస్టాఫ్ వద్ద వేచి ఉంది. ఇంతలో అటుగా వచ్చిన ఆటో ఎక్కింది. ఆటోలో ఉన్న మహిళలు శ్రీనివాస మహాల్ వద్ద దిగిపోయారు. ఆటో నడుపుతున్న యువకుడితోపాటు అతని పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు వెనుక సీటులోకి వచ్చి ఆమెను వేధించడంతో భయపడి వాగు సెంటర్‌లో దిగిపోయింది. ఇంటికి వచ్చిన అనిత ఆటోలో జరిగిన విషయం తన చెల్లెలు మౌనికకు చెప్పింది.
తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ కళాశాలకు పంపరేమోనని భయంతో చెప్పలేదు. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఆమె సోమవారం జరిగిన ఘటనను గుర్తు చేసుకుని మానసిక క్షోభకు గురైంది. ఇంట్లో తల్లి కూడా లేకపోవడంతో జరిగిన విషయాన్ని ఉత్తరం రాసి వంట గదిలో చున్నీతో హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట నుంచి వచ్చిన ఈశ్వరి వంట గదిలో హుక్‌కు వేలాడుతున్న కూమార్తెను చూసి షాక్‌కు గురై గట్టిగా కేకలు వేసింది.
చుట్టు పక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కిందకు దించారు. సంఘటనా స్థలానికి కొత్తపేట సీఐ దుర్గారావు, ఎస్‌ఐలు సుబ్బారావు, మూర్తిలు చేరుకుని పంచనామా నిర్వహించారు. 509, 306 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనిత సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.