student unions protest
-
తెలంగాణ రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై తేనెటీగల దాడి -
నారాయణ ఇంజినీరింగ్ కాలేజిలో విద్యార్థి ఆత్మహత్య
గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): గూడూరు సమీపంలో ఉన్న నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఒకే రోజు రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలియడంతో షాక్‌కు గురైన వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనలతో కళాశాల విద్యార్థులు, సిబ్బంది హతాశులయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వరరెడ్డి (21) నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం కళాశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థి గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఈ విషయాన్ని సహచర విద్యార్థులు గుర్తించి వార్డెన్ శ్రీనివాసులునాయుడు (57)కు చెప్పారు. దీంతో వార్డెన్ షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ని హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై ఒత్తిడి? విద్యార్థిని కళాశాల యాజమాన్యం ఒత్తిడికి గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు రోజులుగా కళాశాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) ఇన్స్పెక్షన్ జరుగుతోందని, ఈ కారణంగా విద్యార్థులను రికార్డుల కోసం, ఇతరత్రా తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు అతని కుటుంబంలో కలహాలే కారణమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే విద్యార్థి బ్యాగులో ఓ కత్తి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
రాయలసీమ ద్రోహి గోబ్యాక్!.. అడుగడుగునా చంద్రబాబుకు నిరసన సెగలు
సాక్షి, కర్నూలు: కర్నూలులో అడుగడుగునా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు నిరసన సెగ తగులుతోంది. చంద్రబాబు కాన్వాయ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. రాయలసీమ ద్రోహి గ్యోబాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ ముందు విద్యార్థులు బైఠాయించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కర్నూలు జేఏసీ నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలు, బ్లాక్ బెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు న్యాయ రాజధానిపై వైఖరి చెప్పాలంటూ నిలదీశారు. మరో వైపు, చంద్రబాబుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. చదవండి: చంద్రబాబుకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు -
కరోనా: ఫీజు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తాం!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతకు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే విద్యార్థిని ఇంటికి పంపిస్తామని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి గణేశ్-శ్రీదేవి దంపతుల కూతురు శృతి. జమ్మికుంట పట్టణంలోని న్యూమిలీనియం స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. పాఠశాలల వేసివేత నేపథ్యంలో తమ కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు గణేశ్–శ్రీదేవి దంపతులు బుధవారం స్కూల్‌కు వచ్చారు. అయితే ఫీజు రూ. 20 వేలు చెల్లిస్తేనే శృతిని ఇంటికి పంపిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇంటిదారి పట్టారు. గురువారం మళ్లీ పాఠశాలకు రాగా, యాజమాన్యం అలాగే చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు బాధితులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై ప్రవీణ్‌రాజ్ పాఠశాల వద్దకు చేరుకుని ఇరువురితో మాట్లాడడంతో యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపిచేందుకు అంగీకరించింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కారంకొండ శ్రావణ్‌కుమార్, శివకుమార్, కొల్లూరి ప్రశాంత్, కల్లపెళ్లి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతిభవన్ ముట్టడిలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అక్రమాలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి రాగా.. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. విద్యార్థులు లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 28 మంది విద్యార్థులను అరెస్టు చేసి గోషామహల్ తరలించారు. ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కోటా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవిలు మాట్లాడుతూ... ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, వారికి జరిగిన అన్యాయం గురించి ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, రీవాల్యుయేషన్ కల్పించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, బోర్డు అధికారులపై చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తునఉద్యమిస్తామని హెచ్చరించారు. -
హోదా కోసం విద్యార్థుల మానవహారాలు
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మానవహరాల్లో సుమారు కోటి మంది విద్యార్థులు పాల్గొన్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని, హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ గాంధీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మద్య వాగ్వివాదం జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడప కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థుల భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు కోసం విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏఐఎస్ఎఫ్, జనసేన విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాసేపయిన తర్వాత విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మానవహారాన్ని పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విధ్యార్ధి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవాహారం. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు. చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థుల మానవహారం. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో మానవహారం. దీనికి సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు నగరం మాగుంట సర్కిల్లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మానవహారం. హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. -
‘కడప ఉక్కు’ మన హక్కు
కడప రూరల్: కడపలో ఉక్కు కర్మాగారం మా హక్కు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలను కట్టిపెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు లేకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం త్వరలో చేపట్టే ‘చలో ఢిల్లీ’ సన్నాహక కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జీపు యాత్ర గురువారం కడపకు చేరింది. ఈ సందర్భంగా స్ధానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జయవర్ధన్, టీఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎన్ రాజా మాట్లాడుతూ ‘కడప ఉక్కు’ సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఆడుతున్న నాట కాలకు తెరదించాలన్నారు. దీంతోపాటు విభజన హమీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పుల్లయ్య, శివప్రసాద్, చంద్ర, అశోక్, రమణ, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనిత ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళన
విజయవాడ : నగరంలోని కేఎల్‌రావు నగర్లో ఇంటర్ విద్యార్థిని రాయపురెడ్డి అనిత ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా కేఎల్‌రావునగర్ 8వ లైన్‌కు చెందిన రాయపురెడ్డి అనిత(16) గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో ఇంటర్ చదువుతుంది. ఆమె తండ్రి ప్రసాద్ వస్త్రలత వద్ద చెరకు రసం విక్రయిస్తుంటాడు. తల్లి ఈశ్వరి వంటలు చేస్తుంటుంది. సోమవారం సాయంత్రం కాలేజీ నుంచి కేఎల్‌రావునగర్ వచ్చేందుకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ బస్టాఫ్ వద్ద వేచి ఉంది. ఇంతలో అటుగా వచ్చిన ఆటో ఎక్కింది. ఆటోలో ఉన్న మహిళలు శ్రీనివాస మహాల్ వద్ద దిగిపోయారు. ఆటో నడుపుతున్న యువకుడితోపాటు అతని పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు వెనుక సీటులోకి వచ్చి ఆమెను వేధించడంతో భయపడి వాగు సెంటర్లో దిగిపోయింది. ఇంటికి వచ్చిన అనిత ఆటోలో జరిగిన విషయం తన చెల్లెలు మౌనికకు చెప్పింది. తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ కళాశాలకు పంపరేమోనని భయంతో చెప్పలేదు. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఆమె సోమవారం జరిగిన ఘటనను గుర్తు చేసుకుని మానసిక క్షోభకు గురైంది. ఇంట్లో తల్లి కూడా లేకపోవడంతో జరిగిన విషయాన్ని ఉత్తరం రాసి వంట గదిలో చున్నీతో హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట నుంచి వచ్చిన ఈశ్వరి వంట గదిలో హుక్కు వేలాడుతున్న కూమార్తెను చూసి షాక్‌కు గురై గట్టిగా కేకలు వేసింది. చుట్టు పక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కిందకు దించారు. సంఘటనా స్థలానికి కొత్తపేట సీఐ దుర్గారావు, ఎస్ఐలు సుబ్బారావు, మూర్తిలు చేరుకుని పంచనామా నిర్వహించారు. 509, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనిత సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.