పనిచేయని.. పల్లె సమగ్ర సేవ!
- ఆర్భాటంగా ప్రారంభం.. ఆదిలోనే తల్లకిందులు
- నెరవేరని లక్ష్యం.. అరకొరగానే సేవలు
- చాలాచోట్ల 2-3 మాత్రమే..
- ఇరుకుగదులు.. ఆపరేటర్ల కొరత
(సాక్షి, మెదక్ జిల్లా నెట్‌వర్క్)
పల్లె ముంగిట వందలాది సేవలను అందించాలని.. కాలు కదపకుండానే అన్నీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించారు. గతేడాది మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న జిల్లాలోని 16 మండలాల్లో వీటిని పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాల్సి ఉంది.
ఈ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 300 వరకు సేవలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పథకం ప్రారంభమై పది నెలలైనా.. పూర్థి స్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. ఒక్కోచోట 300 కాదు కదా.. కనీసం మూడంటే మూడు సేవలు కూడా అందడం లేదు. కేంద్రాల నిర్వహణ అంత అధ్వానంగా మారింది. దీంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు.
ఇరుకు గదుల్లో అరకొర సేవలు
ఎంపిక చేసిన గ్రామంలోని పంచాయితీ కార్యాలయాల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బ్యాంకింగ్, స్త్రీనిధి రుణాల పంపిణీ, ఉపాధి కూలీలకు డబ్బుల పంపిణీ, ఆసరా పింఛన్ల పంపిణీ, జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు తదితర సేవలను అందించాలని నిర్ణయించారు.
ఇందులో విధులు నిర్వర్తించేందుకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి ఇంటర్ ఆపైన పూర్తి చేసిన వారిని గుర్తించి శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలోని టేక్మాల్, సదాశివపేట, జహీరాబాద్, హత్నూర, కల్హేర్, మెదక్, దుబ్బాక, కొండపాక-2, పఠాన్‌చెరు, మిరుదొడ్డి, శివ్వంపేట, గజ్వేల్, కోహీర్ మండలాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
పూర్తి స్థాయిలో పనిచేయని కేంద్రాలు
ఉదయం 7 నుండి 11 గంటల వరకు సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ ఎక్కడా సేవా కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఈ కేంద్రాలను ఆయా పంచాయితీ కార్యాలయాల్లోని ఓ గదిలో ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో విధి నిర్వహణ కష్టంగా మారుతోంది. పంచాయతీ సిబ్బందికి ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూంలోనే కొన్ని కేంద్రాలకు చోటిచ్చారు.
అయితే, ఇప్పటికీ ఆసరా పింఛన్లు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పంచాయితీ కార్యదర్శి ద్వారానే కొనసాగుతున్నాయి. బ్యాంకు లింకేజీల రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సేవలను ఒక గొడుగు కిందికి తెచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన ఇవి.. పూర్తిగా అందుబాటులోకి వచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.