
ఉద్యోగంతోనే సమాజ సేవ
♦ క్రమశిక్షణతోనే ఉన్నత పదవులు
♦ పీటీసీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు
♦ 28 మంది శిక్షణ కానిస్టేబుళ్లు
♦ ఎస్సైలుగా ఎంపికైన వారికి అభినందన
మామునూరు: పోలీసు ఉద్యోగంతోనే సమాజ సేవ చేయడానికి సాధ్యమవుతుందని ఇందుకు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి క్రమ శిక్షణతో సాధన చేస్తే ఉన్నత ఉద్యోగాల అర్హత సాధించవచ్చని పోలీసు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌లోని పోలీసు కళాశాలలో తెలంగాణ వ్యాప్తంగా 603 మంది కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం సివిల్,ఆర్‌ఎస్సైల ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. పీటీసీలో శిక్షణ పొందుతున్న 28 మంది కానిస్టేబుళ్లకు ఎస్సైలుగా ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో బుధవారం పోలీసు కళాశాలలో డీఎస్పీ కుమార్‌స్వామి ఆధ్యక్షతన అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు హాజరై ఎస్సైగా ఎంపికైన శిక్షణ కానిస్టేబుళ్లను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి మంచి అవకాశం పోలీసు ఉద్యోగమని మీ కుటుంబానికే గర్వకారణమన్నారు. ఏ ఉద్యోగంలోనూ ఇంత బాధ్యత ఉండదన్నారు. కానిస్టేబుల్‌గా తీసుకుంటున్న శిక్షణ ఎస్సై శిక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
విధి నిర్వహణలో ఉపయోగపడే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకుని సాంకేతికంగా అభివృద్ధి చెందాలన్నారు. పీటీసీ నుంచి సివిల్ ఎస్సైలుగా 12 మంది, ముగ్గురు ఏఆర్(ఆర్‌ఎస్సై)లు, 11 మంది ఆర్‌ఎస్సైలు(టీఎస్‌ఎస్పీ) ఒక్కరు స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మల్లేషం, జనార్ధన్, రమేష్, పూర్ణచందర్, సు«ధాకర్, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.