ప్రజారోగ్యం కోసం
-
స్వయంగా దోమల మందు పిచికారీ చేసిన ఎమ్మెల్యే చిర్ల
-
పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వినూత్న నిరసన
ఆలమూరు :
ప్రభుత్వం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేపట్టలేక పోతే వైఎస్సార్ సీపీ ఆ బాధ్యత చేపట్టి ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం పినపళ్లలో శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పారిశుద్ధ్య పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ఇలాంటి దుస్థితి వల్లే జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వినూత్నరీతిలో ఎత్తిచూపాలని సంకల్పించారు. గ్రామంలోని రైతుల నుంచి స్ప్రేయర్లు, క్రిమి సంహారక మందులు తెప్పించి, మాస్క్‌ను ధరించి గ్రామంలోని పలు వీధుల్లో స్వయంగా పిచికారీ చేశారు. పార్టీ శ్రేణులు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు.
ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే..,
అంటు వ్యాధుల వ్యాప్తిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే పార్టీ శ్రేణులతో కలిసి పారిశుద్ధ్యం మెరుగుదల పనులు చేశామని జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అంటు వ్యాధుల నివారణకు, డెంగీ కేసులు నియంత్రణకు చర్యలు తీసుకోకుంటే పార్టీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు కర్రి నాగిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, చల్లా ప్రభాకరరావు, యనమదల నాగేశ్వరరావు, మార్గని గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, తమ్మన శ్రీనివాసు, దొమ్మేటి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.