పరిశ్రమ కంటే ప్రజలే ముఖ్యం
-
వారి కోసం పోరాటాలకు సిద్ధం
-
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తుని :
తొండంగి మండలం సముద్ర తీర ప్రాంతంలో విషపదార్థాలను వెదజల్లే దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం, పరిశ్రమ కన్నా ప్రజలే ముఖ్యమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తొండగి మండలం తీరప్రాంతానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, మేరుగు హరి, మెసా సత్తిబాబు తుని పార్టీ కార్యాలయంలో రాజాను కలిశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో లక్ష మంది మత్స్యకారులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారని నాయకులు లె లిపారు. దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మత్స్య సంపద అంతరించి, మత్స్యకారులు ఉపాధి కోల్పోయి, వలసపోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేయాలే తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని, 30 ఏళ్ల నుంచి టీడీపీకి కంటికి రెప్పలా ఉన్న మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలను యనమల రామకృష్ణుడు నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం సొమ్ముల కోసం సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేయడం తగదన్నారు. కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, తొండంగి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ మాజీ జెడ్పీటీసీ కాశీ
స్థానిక శాంతినగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాజా సమక్షంలో టీడీపీకి చెందిన కాశీ విశ్వేశ్వరరావు పార్టీ చేరారు. ఆయనకు ఎమ్మెల్యే రాజా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చొక్కా కాశీ విశ్వేరరావు మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన తీర ప్రాంత ప్రజలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తొండంగి మండలంలో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసి సభలు జరగకుండా చేసిందని, త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరతారన్నారు. దానవాయిపేట పంచాయతీ మాజీ సర్పంచ్ మేరుగు హరిబాబు, కోస్తా జాతీయ మత్స్యకార పరిరక్షణ కాలుష్య నివారణ సంఘం చైర్మన్ మెసా సత్తిబాబు, ఎ.ప్రకాశరావు, కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, మోతుకూరి వెంకటేష్ పాల్గొన్నారు.