పూజకు పూలేవయ్యా..
-
రామాలయంలో గాడితప్పిన పాలన
-
నాలుగు రోజులుగా గజమాల అలంకరణ బంద్
-
స్వామివారి పూజల్లో సైతం లోపాలు
-
పట్టించుకోని ఆలయ అధికారులు
భద్రాచలం : ఆలయ పాలన అస్తవ్యస్తం.. అర్చకులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు.. నిత్య పూజలందుకునే రామయ్య అలంకరణకే పూలు కరువు.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాములకే పరీ„ý పెడుతుంటే.. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. అర్చకులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతో రాములోరికి నిత్య పూజలు సైతం సవ్యంగా సాగడం లేదు. సోమవారం స్వామివారి అలంకరణ కోసం తెచ్చిన పూలు కుళ్లిపోవడంతో అలంకరించలేదని అర్చకులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా పూల సరఫరా ఇలాగే ఉందని, అందుకే గజమాలల అలంకరణ చేయడం లేదని అర్చకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ పర్యవేక్షకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, చేసేది లేక పూలదండలు స్వామివారి మెడలో కాకుండా గర్భగుడిలోని బంగారు వాకిలి వద్ద అలంకరించాల్సి వస్తోందన్నారు. ప్రతీ రోజు స్వామివారి అలంకరణ నిమిత్తం నాలుగు గజమాలలు ఉపయోగిస్తారు. ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలను కూడా అలంకరిస్తారు. అయితే స్వామివారికి నాలుగు రోజులుగా గజమాలల అలంకరణ జరగటం లేదని ఆలయ ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రతీ రోజు తొమ్మిది గజమాలలు ఆలయానికి వస్తాయి. మూలవరులకు నాలుగు, లక్ష్మీతాయారమ్మ వారికి, ఆంజనేయస్వామికి, ఆండాళ్లమ్మ వారికి, హయగ్రీవ స్వామికి, రంగనాయక స్వామి వారికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 గజమాలలు, 5 చిన్న గజమాలలు, 59 పూలమాలలతో ఆలయంలో ప్రతీ రోజు అలంకరిస్తారు. గజమాల అలంకరణలో మెరిసిపోయే స్వామి వారిని చూసి భక్తులు తరిస్తారు. నాలుగు రోజుల నుంచి బూజుపట్టిన పూలదండలు వస్తుండటంతో వాటిని ఉపయోగించడం లేదని అర్చకులు చెబుతున్నారు. పూలు సరఫరా చేసే వారు సరైన పూలు సరఫరా చేయకపోవడం, మాలలు కట్టడంలో లోపాలు ఉండటంతో అవి స్వామివారికి అలంకరణ యోగ్యంగా ఉండటం లేదని అర్చకులు తెలిపారు. అంతేకాక స్వామివారి పూజల్లో సైతం పలు లోపాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
తీరు మారదా..
ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయం కావడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. వీటిని అర్చకులే మాయం చేశారని దాదాపుగా వెల్లడైంది. దీనిపై ఆలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య తీవ్ర తర్జన భర్జన సాగుతుండగా.. ఇటువంటి తరుణంలో ఆలయంలో జరిగే పూజల్లోఅపశ్రుతులు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రెండు వారాల కాలంలో ఆలయంలో జరుగుతున్న పరిణామాలు రాములోరి క్షేత్ర ప్రతిష్టకు మాయని మచ్చ తెచ్చిపెట్టాయి. ఆలయ తలుపులు ఆలస్యంగా తెరవడం.. సీతరాముల కల్యాణాన్ని సకాలంలో ప్రారంభించకపోవడం.. తాజాగా గజమాల అలంకరణ లేకపోవడం ఇక్కడి పాలన తీరుపై వేలెత్తి చూపుతోంది. బంగారు నగలు మాయమైన కేసును మరుగున పడేసేందుకు పై స్థాయిలో ఇక్కడి అధికారులపై వత్తిళ్లు వస్తుండటంతో.. ఆభరణాలు మాయం చేసిన అర్చకులు తమకేమీ కాదులే అని ధీమాగా ఉన్నారు. అర్చకుల మధ్య ఆదిపత్య పోరు, ఉద్యోగులతో వారికి పొసగకపోవడం వంటి కారణాలతోనే తరచూ ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయానికి సంబంధించి వస్త్రాలు తీసుకుని వెళ్తున్నారనే నెపంతో గతంలో ఇక్కడి అధికారులు ఓ అర్చకుడిని పోలీసులకు అప్పగించారు. విధుల పట్ల అలసత్వంగా ఉంటున్నారనే కారణంతో సస్పెన్షన్‌లు, రివర్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఏకంగా సీతమ్మ వారి పుస్తెల తాడునే మాయం చేసిన అర్చకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
పూల కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం..
స్వామివారి అలంకరణకు సరఫరా చేసే పూలు పాడైపోయిన విషయం వాస్తవమేనని ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు తెలిపారు. వర్షంతో పూలు తడిసి పోయినందునే ఇలా జరిగిందని చెప్పారు. మంగళవారం నుంచి మంచి పూలు తెప్పిస్తామన్నారు. స్వామివారి అలంకరణకు పూల సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.