ఈ ఘాట్ రూపు మారునేమో..
పుష్కర ఘాట్లు.. ఇక ఫుడ్‌కోర్టులు
Published Mon, Aug 29 2016 7:44 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
కృష్ణానది ఒడ్డున ఉన్నవారికి మళ్లీ తిప్పలు
ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం
సీతానగరం (తాడేపల్లి రూరల్): కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు త్వరలోనే ఫుడ్ కోర్టులుగా మారనున్నాయి. కృష్ణానదికి దిగువ ప్రాంతంలో విజయవాడ, సీతానగరం ప్రాంతాలలో నిర్మించిన ఈ ఘాట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి 24 గంటలూ ఫుడ్ కోర్టులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గ వారధి వరకు వివిధ రకాల బోట్లు ఏర్పాటు, నీటిలో విన్యాసాలు, ప్యారాచూట్ లాంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని నిమిత్తం కనకదుర్గ వారధి వద్ద 12 అడుగుల మేర ఫైబర్ గేటును ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాని నిమిత్తమే కనకదుర్గ వారధి వద్ద ప్రస్తుతం పది అడుగులమేర క్రాస్ బండ ఏర్పాటు చేసి, నీటినిల్వను కూడా పరిశీలించారు. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకుంటే విజయవాడ, మహానాడు ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఇళ్లు కూడా తొలగిస్తారనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇళ్లు తొలగించిన ప్రాంతంలో మినీ పార్కులు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ బాధ్యతలను బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు పర్యాటక సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం. సదరు సంస్థ నిర్వహించేందుకు సుముఖం వ్యక్తం చేసినప్పటికీ స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులు తమకు కూడా వాటాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు, సదరు సంస్థకు చెందిన వ్యక్తులు ఇందుకు నిరాకరించడంతో కొంతమేర ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఏదేమైనా పర్యాటక రంగం పేరుతో ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొంతమంది అధికారులు దీనిని ఏపీ టూరిజానికి అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సలహాలు అందజేసినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement