పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలి
– కలెక్టర్‌కు విన్నవించిన జక్కంపూడి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: పుష్కర ఎత్తిపోతలు, సత్యసాయి తాగునీటి పథకం, పోలవరం ఎడవ కాలువలో ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నారని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రను కలిశారు. అవార్డు నోటీసులు రైతుల ఇంటికి వెళ్లి ఇవ్వకుండా వారి పోలాలల్లోని రాళ్లకు, స్తంభాలకు అంటించడం దారుణమన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని అడిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. రైతుల భూములు తీసుకుని తిరిగి వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కేసుల ఎత్తివేతపై సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. వారి వెంట వామపక్ష నేతల అరుణ్, నల్లా రామారావు, వైఎస్సార్‌సీపీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, కోడికోట తదితరులు ఉన్నారు.