purushottapatnam
-
పట్టిసీమ, పురుషోత్తపట్నంలలో పర్యావరణ ఉల్లంఘనలు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.39 కోట్ల పరిహార భారం పడనుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన సంయుక్త కమిటీలు వేర్వేరు నివేదికల్లో స్పష్టం చేశాయి. పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, పురుషోత్తపట్నం ఎత్తిపోతలలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జమ్ముల చౌదరయ్య తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై ఎన్జీటీ నియమించిన కమిటీలు నివేదికలు సమర్పించాయి. వీటికి సంబంధించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించటంపై రూ.4,39,27,393 ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కమిటీలు స్పష్టం చేశాయి. గోదావరి–పెన్నా అనుసంధానంపై కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించలేదని, గోదావరి–పెన్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు నెలల్లో నివేదిక అందిస్తామని కమిటీ ఎన్జీటీకి తెలిపింది. పట్టిసీమ భారం రూ.1,90,85,838 ► పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ ఉల్లంఘనల (వ్యర్థాలు తొలగించేందుకు శాస్త్రీయ ప్రణాళిక లేకపోవడం, 2017, 2018లో ఎక్కువ నీటిని మళ్లించడం తదితరాలు) కారణంగా రూ.82,68,750. దుమ్ము, ధూళి కారణంగా పర్యావరణ నష్ట పరిహారం రూ.7,24,240. ► మురుగునీటి నిర్వహణ ప్రణాళిక లేకపోవడం, పర్యావరణానికి హాని కలిగించకుండా చర్యలు చేపట్టకపోవడం వల్ల రూ.7,59,200. ► వ్యర్థాల డంపింగ్ పరిహారం రూ.1,45,340. ► వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలపై పరిహారం రూ.1,10,653. పై భాగంలో మట్టిని లాభదాయకంగా వినియోగించకపోవడంపై పరిహారం రూ.90,77,655. ► 1,157 చెట్ల నరికివేతపై పరిహారం చెల్లించడంతో పాటు ఇతర ప్రాంతంలో మొక్కలు నాటాలి. ఠి అనుమతి లేకుండా ఎత్తిపోతలు చేపట్టడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు, జీవనంపై ప్రభావం. పురుషోత్తపట్నం పరిహారం రూ.2,48,41,555 ► ర్యాంపు నిర్మాణం, చెత్త పారవేయడం, నీటిని +14.0 ఎం వద్ద ఎత్తిపోతలు చేపట్టినందుకు పర్యావరణ పరిహారం రూ.1,02,75,000. ► దుమ్ము కారణంగా పరిహారం రూ.15,72,774. ► వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక లోపానికి పరిహారం రూ.9,56,600. ► మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పరిహారం రూ.1,72,185. ► ఏపీ పీసీబీ అనుమతులు లేకుండా ఇసుక వినియోగం, ఇసుక మైనింగ్‌కు పరిహారం రూ.43,83,550. ► వాహన ఉద్గారాల పరిహారం రూ.1,24,946. ► మట్టిని లాభదాయకంగా వినియోగించనందుకు పరిహారం రూ.73,56,500. ► ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సర్ప్లస్ నీటిని డ్రా చేయడంపై గోదావరి ట్రిబ్యునల్ స్థాయిని నిర్ణయించింది. ఈ మేరకు +14.0 ఎం వద్దకు చేరినప్పుడే పురుషోత్తపట్నం పథకంలో నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. -
15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల
కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు, గండికోట వద్ద నీటి డెలివరీ ఫాయింట్, పురుషోత్తపట్నం నుంచి సీతానగరం, నాగంపల్లి మీదుగా అచ్చయ్యపాలెం, గండికోట మార్గాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పైలాన్ ఏర్పాటుపై అసహన వ్యక్తం పైలాన్ ఏర్పాటుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి కాస్త దూరంలో విద్యుత్ స్తంభాల వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను తక్షణమే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసి మొదటి దశ నీరు విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం సీతానగరం నుంచి పథకం వద్దకు కాన్వాయ్ ద్వారా చేరుకుని నీరు విడుదల చేస్తారని చెప్పారు. అనంతరం సీతానగరం చేరుకుని గండికోట వద్ద పోలవరం ఎడమ కాలువలో పథకం నీరు డెలివరీ పాయింట్‌ను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జగ్గంపేటలో నిర్వహించే సభకు వెళ్తారని చెప్పారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఎస్.పి.బి.రాజకుమారి, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సి.ఎస్.ఎన్.మూర్తి, విద్యుత్ శాఖ డీఈ రాజబాబు, ఏడీఈ కె.రత్నాలరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, తహసీల్దార్ కె.చంద్రశేఖరరావు, టి.గోపాలకృష్ణ, కె.పోశయ్య, దేవి, ఎంపీడీఓ డి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఆ పొరపాటే ఎడమన కూడా
-మరో పట్టిసీమ కానున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతలు – ఇంకా పనులు పూర్తికాకున్నా 15న నీరు తోడేందుకు సన్నాహాలు – కిలోమీటర్ మేర భూమిపైనే పైపులు – ప్రారంభ దశలోనే మురారి, మల్లేపల్లి బ్రిడ్జిలు – తాత్కాలిక ఏర్పాట్లకు అధికారుల యత్నాలు – నేడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం / సీతానగరం : ‘పోలవరం ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలాగే ఎడమ కాలువపై ఏర్పాటు చేస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా పూర్తి కాకముందే సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారా? ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో నీరు పారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారా?’ అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పనులు పూర్తి చేయకుండానే ఈ నెల 15న అనుకున్న ప్రకారం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమను ప్రారంభించి జాతికి అంకితం చేసినట్లుగా ఇప్పుడు పురుషోత్తపట్నం ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పనులు ఈ నెల 15కి పూర్తి అయ్యే పరిస్థితి కనపడడంలేదు. అయితే అనుకున్న తేదీ ప్రకారం ఎలాగైనా ప్రారంభించేందుకు యంత్రాగం హడావుడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. హడావుడితో నాణ్యతకు తిలోదకాలు గోదావరి నుంచి పురుషోత్తపట్నం వద్ద పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి 10.10 కిలోమీటర్ల దూరంలోని పోలవరం కాలువకు పంపించి అక్కడ నుంచి ఏలేరు ప్రాజెక్టుకు, ఆయకట్టును నీటిని అందించే లక్ష్యంతో రూ.1,638 కోట్లతో ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. ఏలేరు జలాశయం నుంచి విశాఖకు గోదావరి నీటిని అందించేందుకు పురుషోత్తపట్నం స్టేజ్ -1, స్టేజ్ -2గా పనులు విభజించి చేపడుతున్నారు. స్టేజ్ -1లో పంప్‌హౌస్ వద్ద పది పంపులను ఏర్పాటు చేసి ఒకో పంప్ ద్వారా 350 క్యూసెక్కులు నీటిని తోడాలని ప్రతిపాదించారు. ఆ లెక్కన మొత్తం 3,500 క్యూసెక్కుల నీటిని తోడవచ్చు. స్టేజ్ -2లో రామవరంలో పోలవరం 50వ కిలోమీటరు వద్ద పంప్‌హౌస్ నిర్మించి 8 పంపుల ద్వారా 175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరులోకి 13.12 కిలోమీటర్ల మేర రెండు లైన్లలో ఏర్పాటు చేసే పైపులైన్ల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంది. అలాగే 57.885 కిలో మీటరు కృష్ణవరం వద్ద క్రాస్ రెగ్యులేటరు నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. ఆగస్టు 15కి నీటిని అందిస్తామని ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు చెబుతుండగా పనులు మాత్రం పూర్తి కాలేదు. జగ్గంపేట మండలంలో ఒక వరస పైపులైన్ ద్వారా నీటిని పంపాలని చూస్తున్నారు. హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. పోలవరం కాలువ ద్వారా రామవరం వద్ద స్టేజ్ -2కు నీరు చేరేందుకు మురారి, మల్లేపల్లి వద్ద వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. ఈ వంతెనల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కానీ నీరు పారేందుకు వీలులేదు. బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా రోడ్డు కింద తూములు ఏర్పాటు చేసి నీరు పారించాలని అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో హడావుడిగా పనులు చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిపైకి లేచిన పైపులు.. 10 పంపుల నుంచి ఐదు వరసలలోని తరలించేందుకు పైపులను అమర్చాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో రెండు వరసల మేర భూమిలో పైపులు వేశారు. అయితే గత నెల 18న ఈపథకంలో భాగంగా వేసిన 150 పైపులు భూమిలో నుంచి పైకి లేచాయి. దాదాపు కిలో మీటరు మేర లేచిన పైపుల్లో కొన్ని చోట్ల జాయింట్లు విడిపోయాయి. పైపులు వేయడానికి తీసిన గోతుల్లో ఈ మధ్య కురిసిన వర్షాలు, గోదావరిలో వరద వల్ల నీరు ఊరుతుండడంతో పైపులు పైకి ఉబికి వచ్చాయి. ఈ నెల 15 కల్లా నీరు తోడాలన్న ఉద్దేశంతో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా పైపులు అమర్చారు. పైపులు అమర్చే ముందు కాలువలో ఇసుక వేయలేదు. ఫలితంగా రామవరపు ఆవ వద్ద భూమిలో నీరు ఊరడంతో భూమిలోని పైపులు పైకి లేచాయి. ప్రారంభానికి తాత్కాలిక ఏర్పాట్లు... కాలువలో ఇసుక నింపి పైప్‌లైన్ వేయాల్సి ఉండగా, 15 కల్లా నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో పనులలో తీసుకోవలసిన నాణ్యతా చర్యలను మమ అనిపించి, పైప్‌లైన్ వేశారని పలువురు ఆరోపించారు. పైకి లేచిన పైపులను యంత్రాల ద్వారా తీవ్ర ఒత్తిడితో కిందకు నొక్కినా ప్రయోజనం లేకపోయింది. ఒక వరస మేర కిలోమీటరు పొడవున పైప్‌లైన్ భూమి పైనే ఉంచి, ప్రారంభోత్సవానికి అడ్డంకి లేకుండా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత రెండు మోటార్లను ఆఫ్ చేసి పైప్‌లైన్‌ను సరిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
దౌర్జన్యంగా భూముల తీసుకుని నట్టేట ముంచారు
‘పురషోత్తపట్నం’ రైతుల ఆవేదన సంతకాలు చేయని రైతుల రిలే దీక్షల ప్రారంభం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ సీతానగరం (రాజానగరం) : ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంతకాలు చేయని రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నాగంపల్లి, చినకొండేపూడి, వంగలపూడి, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల రైతులు సీతానగరం బస్టాండ్‌లో మంగళవారం దీక్షలు చేపట్టారు. రిలే దీక్ష కోసం బస్టాండ్‌లో టెంట్ వేయడానికి రైతులు సిద్ధపడగా, స్థానిక ఎస్సై ఎ. వెంకటేశ్వరావు సిబ్బందితో వచ్చి టెంట్ వేయడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో టెంట్ లేకుండానే రైతులు దీక్ష ప్రారంభించారు. దీక్ష వెనుక కట్టిన ప్లెక్సీని తొలగించాలని పోలీసులు పట్టుబట్టినా రైతులు వ్యతిరేకించారు.తమ భూములు బలవంతంగా తీసుకుని, తమపై దౌర్జన్యం చేయడమే గాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆంక్షలు విధిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ.. ప్రభుత్వం నెలకొల్పే ప్రాజెక్ట్‌లకు తాము వ్యతిరేకం కాదని, అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తున్న ప్రతి ఎకరానికి రూ.33.60 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఎకరానికి రూ.28 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంటోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అవార్డ్ పాస్ చేసి, నోటీసులు జారీ చేసిన 15 రోజుల వరకూ గడువు ఉన్నప్పటికీ పోలీస్ ఫోర్స్‌తో భూములను దౌర్జన్యంగా తీసుకోవడమే గాకుండా తమపై కేసులు పెట్టి, హౌస్ అరెస్టులు చేయించడం తగునా? అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంలో పూర్తిగా భూములు కోల్పోయి నిరాశ్రయులైన రైతులకు ప్రాజెక్ట్‌ను ఆనుకుని ఉన్న భూముల్లో ఎకరం చొప్పున అందించి, జీవనాధారం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ భూముల్లోకి తమను వెళ్లనీయకుండా అడ్డుకుని పైప్‌లైన్ పనులు చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను మోసగించారన్నారు. దీక్షలో కలగర సర్వారాయుడు, కరుటూరి శ్రీనివాస్, కలవచర్ల ప్రసాద్, కోడేబత్తుల ప్రసాదరాజు, కోడేబత్తుల దొరబాబు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, తోటకూర పుల్లపురాజు, మడిచర్ల సత్యనారాయణ, మడిచర్ల రాంబాబు, కలగర బాలకృష్ణ, కొండ్రు రమేష్, చల్లమళ్ల విజయ్‌కుమార్ చౌదరి, మట్ట వసంతరావు, పోశారావు పాల్గొన్నారు. -
పురుషోత్తపట్నం పథకం పనుల అడ్డగింత
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రామచంద్రపురం రైతులు అడ్డుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు భూములు ఇచ్చిన రైతు దుగ్గిరాల చిరంజీవిరావు భూమిలో పొక్లెయిన్‌తో పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. పైప్‌లైన్‌కు కాలువను తవ్వుతుండగా రైతులు, మహిళలు అడ్డుకున్నారు. రైతులు కోడేబత్తుల ప్రసాదరావు, కోడేబత్తుల రమాదేవి, కరుటూరి రజనీ, నున్న గంగాలక్ష్మి, విజయ్‌కుమార్ చౌదరి, మండ వెంకటరామారావు, సుశీశ్వర్లు తదితరులతో మహిళలు తరలివచ్చారు. పనులు ఆపకపోవడంతో పొక్లెయిన్‌కు అడ్డుగా బైఠాయించారు. ప్రాణాలు పోయినా సరే పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సంతకాలు చేయకుండా భూములను బలవంతంగా తీసుకుని, పనులు చేయడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నించారు. భూములను ఇచ్చేది లేదంటూ నినదించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతవరకు భూములలో పనులు చేయనిచ్చేది లేదని రైతులు తెలిపారు. దీంతో పనులను నిలిపివేశారు. భూముల్లోకి వెళ్లనీయరా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బలవంతంగా తీసుకున్న భూములపై మీకేంటి అధికారం, భూములలోకి వెళ్లనీయరా అంటూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నిలదీశారు. సీతానగరం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణ సంతకాలు చేయని రైతుల భూములలోకి రైతులు వెళ్ళకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని, సంతకాలు చేసిన వారికి, చేయని వారికి వేర్వేరుగా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఆదివారం సీతానగరం బస్టాండ్ సెంటర్ నుంచి అఖిలపక్షంతో రైతులు పాదయాత్రగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్దకు వెళతామని, బలవంతంగా తీసుకున్న భూములలో కూర్చుంటామని హెచ్చరించారు. రైతులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ స్పందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల వెంకట్రాజు, చల్లమళ్ల సుజీరాజు, శివ, అను, అభి, సుంకర నరసింహరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలి
– కలెక్టర్‌కు విన్నవించిన జక్కంపూడి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం: పుష్కర ఎత్తిపోతలు, సత్యసాయి తాగునీటి పథకం, పోలవరం ఎడవ కాలువలో ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నారని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రను కలిశారు. అవార్డు నోటీసులు రైతుల ఇంటికి వెళ్లి ఇవ్వకుండా వారి పోలాలల్లోని రాళ్లకు, స్తంభాలకు అంటించడం దారుణమన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని అడిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. రైతుల భూములు తీసుకుని తిరిగి వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కేసుల ఎత్తివేతపై సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. వారి వెంట వామపక్ష నేతల అరుణ్, నల్లా రామారావు, వైఎస్సార్సీపీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, కోడికోట తదితరులు ఉన్నారు. -
బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఆందోళన
రైతుల పార్టీగా అఖిలపక్ష పోరాటం వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి నార్త్‌జోన్ డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో చర్చలు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. బలవంతంగా భూములు తీసుకున్న రైతులతో కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా నార్త్‌జోన్ డీఎస్సీ ప్రసన్నకుమార్‌తో జక్కంపూడి చర్చించారు. రైతులకు పోలీసుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో సంప్రదించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం మధ్యాహ్న వరకూ మీరు రైతులకు అందించే న్యాయం కోసం చూస్తామని, గురువారం నుంచి రైతు కుటుంబాలతో కలిసి భూముల్లో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డీఎస్పీకి సూచించారు. పై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భూములు తీసుకుంటున్నామంటూ మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల గోడలకు నోటీసులు అతికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్‌బాబు, వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంట్రాజు, బాధిత రైతులు ఐఎస్ఎన్ రాజు, గద్దె రామకృష్ణ, కలగర్ల భాస్కరరావు, కలగల సర్వారాయుడు, కరుటూరి విజయ్‌కుమార్ చౌదరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పురుషోత్తపట్నం ‘ఎత్తిపోతలు’ అడ్డగింపు
–2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులన్న రైతులు సీతానగరం (రాజానగరం) : మండలంలోని రామచంద్రపురం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. హైకోర్టు సూచించిన ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రామచంద్రపురం వద్ద గల తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ఎడమ కాలువ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేయడానికి పొక్లెయిన్ తరలివచ్చింది. కాలువ వద్ద పనులు చేయడానికి సిద్ధపడగా సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు. తొర్రిగడ్డ ఎడమ కాలువలో రామచంద్రపురం దూళ్ళపాటి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ వేయడానికి పొక్లెయిన్‌తో తవ్వకాలు ప్రారంభించారు. రామచంద్రపురానికి చెందిన రైతులు కలగల బాలకృష్ణ, చల్లమళ్ల గాంధీ, కోడేబత్తుల దొరాజీ, చల్లమళ్ల ధర్మరాజు, చల్లమళ్ల విజయ్‌కుమార్ చౌదరి, కోడేబత్తుల శ్రీనివాసరావు, కోడేబత్తుల పెంటయ్య, ప్రసాద్‌తోపాటుగా అధిక సంఖ్యలో రైతులు తరలివెళ్ళి పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధికారులు ఘటనా స్థలికి తరలివచ్చారు. పొక్లెయిన్‌తో ప్రభుత్వ భూములలో పనులు చేస్తున్నామని, కాలువ వద్ద పైప్‌లైన్‌కు చెందిన పైప్‌లు ఏర్పాటు చేస్తే, ఖరీఫ్‌కు సాగునీటికి అంతరాయం కలగదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం వద్ద పనులు చేయడానికి మేము ఎంతమాత్రం సుముఖంగా లేమని, హైకోర్టు తీర్పుననుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతోపాటుగా వివిధ ప్రయోజనాలు కల్పించాకే ఇక్కడ పనులు చేయడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీనితో పొక్లెయిన్ తీసుకుని అక్కడ నుంచి అధికారులు నిష్క్రమించారు. -
‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ బాధిత రైతులకు ఊరట
–2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి -హైకోర్టు తీర్పుతో పెరగనున్న పరిహారం -ఒనగూరనున్న అనేక ప్రయోజనాలు సీతానగరం : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు శుక్రవారం నాటి హైకోర్టు తీర్పుతో ఊరట చెందారు. గతంలో భూసేకరణలో తమ భూములు ఇచ్చేందుకు సుమారు 230 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. మిగిలిన రైతులు తమ భూములు ఎకరానికి రూ.28 లక్షలకు ఇచ్చేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. భూములకు ధర చెల్లింపులో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ న్యాయవాది బి.రచనారెడ్డి రైతుల తరఫున పిటిషన్ వేశారు. 2013 భూసేకరణ చట్టం వర్తింపుతోనే ఎత్తిపోతల పథకానికి భూములు తీసుకోవాలని శుక్రవారం హైకోర్టు జడ్జి శేషసాయి తీర్పు చెప్పారని రైతులు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వం నాలుగు రెట్ల ధరను పరిహారంగా అందించాలి. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. దీనితో పాటు ఈ భూములపై ఆధారపడిన కూలీలకు ఆరునెలల కూలి చెల్లించాలి. భూములు కోల్పోయే కుటుంబంలోని 18 ఏళ్ళు నిండిన యువకులకు ఉద్యోగం లేదా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. అలాగే ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరపాలి. బహుళ పంటలు పండే భూములకు రెట్టింపు పరిహారం చెల్లించాలి. ఇలా పలు అంశాలు 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చి ఉన్నాయి. వీటిని అమలు పర్చాలంటే ఆరునెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతుల భూముల్లో పనులు యథావిధిగా జరుగుతాయి. -
సంతకాలు సగమే
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఆది నుంచీ అవాంతరాలు సంతకాలకు దూరంగా çసగం మంది సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతా సాఫీగా సాగిపోతోందని ... రైతులంతా పూర్తి అంగీకారంగా ఉన్నారని ‘దేశం’ నేతలు ... అధికారులు ఓ వైపు చెబుతున్నా ఇంకోవైపు సగం మంది రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పలు పథకాల్లో తమ భూములను కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేది లేదని ఎదురుతిరిగి పైప్‌లై¯ŒS మార్గంలో భూసేకరణ నిమిత్తం చేపట్టిన సర్వేలను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిడితో, అధికారుల బెదిరింపులతో సగం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పథకంలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రైతులున్నారు. మొత్తం రైతులు 321 మంది ఉండగా, 203.62 ఎకరాలు భూసేకరణలో ఉంది. ఇప్పటికి 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలుత భూ సర్వేను రైతులు అడ్డుకుని నిలిపివేయడంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి రైతులతో సంప్రదించగా భూసర్వే సక్రమంగా జరిగింది. పరిహారం విషయంలో పలు సమావేశాలు, చర్చలు అనంతరం రూ.28 లక్షలు అందిస్తామని, నాగంపల్లి రెవెన్యూలో రూ.24 లక్షలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను ఒప్పించారు. దీంతో 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మిగిలిన 115 మంది రైతులు సంతకాలు చేయలేదు. వీరికి అధికారులు, ప్రజాప్రతినిధులు బుజ్జగింపు చర్యలు చేపట్టారని సమాచారం. రూ.28 లక్షలు నష్టదాయకమే... ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచామని చెప్పి రూ.28 లక్షలు అందించడం కూడా కొంతమంది రైతులకు రుచించడం లేదు. మార్కెట్ ధర కూడా ప్రభుత్వం అందించడం లేదని, ఎకరానికి రూ.50 లక్షలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సగానికి పైగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతులకు పరిహారం మార్చి నెలాఖరుకు అందించే అవకాశం ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం రూ.28 లక్షలు వస్తుందని, అదనంగా ఫల వృక్షాలకు, బోరులకు ధర చెల్లించాల్సి ఉంటుందని, రైతులకు పెంచి ఇచ్చింది ఏమీ లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు.. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయని రైతులు త్వరలో కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రాజెక్టులకు స్టే తీసుకువచ్చిన తెలంగాణా న్యాయవాదులను రైతులు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.