
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.39 కోట్ల పరిహార భారం పడనుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన సంయుక్త కమిటీలు వేర్వేరు నివేదికల్లో స్పష్టం చేశాయి. పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, పురుషోత్తపట్నం ఎత్తిపోతలలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జమ్ముల చౌదరయ్య తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై ఎన్జీటీ నియమించిన కమిటీలు నివేదికలు సమర్పించాయి. వీటికి సంబంధించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించటంపై రూ.4,39,27,393 ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కమిటీలు స్పష్టం చేశాయి. గోదావరి–పెన్నా అనుసంధానంపై కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించలేదని, గోదావరి–పెన్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు నెలల్లో నివేదిక అందిస్తామని కమిటీ ఎన్జీటీకి తెలిపింది.
పట్టిసీమ భారం రూ.1,90,85,838
► పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ ఉల్లంఘనల (వ్యర్థాలు తొలగించేందుకు శాస్త్రీయ ప్రణాళిక లేకపోవడం, 2017, 2018లో ఎక్కువ నీటిని మళ్లించడం తదితరాలు) కారణంగా రూ.82,68,750. దుమ్ము, ధూళి కారణంగా పర్యావరణ నష్ట పరిహారం రూ.7,24,240.
► మురుగునీటి నిర్వహణ ప్రణాళిక లేకపోవడం, పర్యావరణానికి హాని కలిగించకుండా చర్యలు చేపట్టకపోవడం వల్ల రూ.7,59,200.
► వ్యర్థాల డంపింగ్ పరిహారం రూ.1,45,340.
► వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలపై పరిహారం రూ.1,10,653. పై భాగంలో మట్టిని లాభదాయకంగా వినియోగించకపోవడంపై పరిహారం రూ.90,77,655.
► 1,157 చెట్ల నరికివేతపై పరిహారం చెల్లించడంతో పాటు ఇతర ప్రాంతంలో మొక్కలు నాటాలి. ఠి అనుమతి లేకుండా ఎత్తిపోతలు చేపట్టడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు, జీవనంపై ప్రభావం.
పురుషోత్తపట్నం పరిహారం రూ.2,48,41,555
► ర్యాంపు నిర్మాణం, చెత్త పారవేయడం, నీటిని +14.0 ఎం వద్ద ఎత్తిపోతలు చేపట్టినందుకు పర్యావరణ పరిహారం రూ.1,02,75,000.
► దుమ్ము కారణంగా పరిహారం రూ.15,72,774.
► వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక లోపానికి పరిహారం రూ.9,56,600.
► మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పరిహారం రూ.1,72,185.
► ఏపీ పీసీబీ అనుమతులు లేకుండా ఇసుక వినియోగం, ఇసుక మైనింగ్‌కు పరిహారం రూ.43,83,550.
► వాహన ఉద్గారాల పరిహారం రూ.1,24,946.
► మట్టిని లాభదాయకంగా వినియోగించనందుకు పరిహారం రూ.73,56,500.
► ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సర్‌ప్లస్ నీటిని డ్రా చేయడంపై గోదావరి ట్రిబ్యునల్ స్థాయిని నిర్ణయించింది. ఈ మేరకు +14.0 ఎం వద్దకు చేరినప్పుడే పురుషోత్తపట్నం పథకంలో నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment