పురుషోత్తపట్నం పథకం పనుల అడ్డగింత
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రామచంద్రపురం రైతులు అడ్డుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు భూములు ఇచ్చిన రైతు దుగ్గిరాల చిరంజీవిరావు భూమిలో పొక్లెయిన్‌తో పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. పైప్‌లైన్‌కు కాలువను తవ్వుతుండగా రైతులు, మహిళలు అడ్డుకున్నారు. రైతులు కోడేబత్తుల ప్రసాదరావు, కోడేబత్తుల రమాదేవి, కరుటూరి రజనీ, నున్న గంగాలక్ష్మి, విజయ్‌కుమార్ చౌదరి, మండ వెంకటరామారావు, సుశీశ్వర్లు తదితరులతో మహిళలు తరలివచ్చారు. పనులు ఆపకపోవడంతో పొక్లెయిన్‌కు అడ్డుగా బైఠాయించారు. ప్రాణాలు పోయినా సరే పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సంతకాలు చేయకుండా భూములను బలవంతంగా తీసుకుని, పనులు చేయడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నించారు. భూములను ఇచ్చేది లేదంటూ నినదించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతవరకు భూములలో పనులు చేయనిచ్చేది లేదని రైతులు తెలిపారు. దీంతో పనులను నిలిపివేశారు.
భూముల్లోకి వెళ్లనీయరా?
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బలవంతంగా తీసుకున్న భూములపై మీకేంటి అధికారం, భూములలోకి వెళ్లనీయరా అంటూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నిలదీశారు. సీతానగరం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణ సంతకాలు చేయని రైతుల భూములలోకి రైతులు వెళ్ళకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని, సంతకాలు చేసిన వారికి, చేయని వారికి వేర్వేరుగా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఆదివారం సీతానగరం బస్టాండ్ సెంటర్ నుంచి అఖిలపక్షంతో రైతులు పాదయాత్రగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్దకు వెళతామని, బలవంతంగా తీసుకున్న భూములలో కూర్చుంటామని హెచ్చరించారు. రైతులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ స్పందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల వెంకట్రాజు, చల్లమళ్ల సుజీరాజు, శివ, అను, అభి, సుంకర నరసింహరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.