ఆ పొరపాటే ఎడమన కూడా
ఆ పొరపాటే ఎడమన కూడా
Published Sun, Aug 6 2017 11:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM
-మరో పట్టిసీమ కానున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతలు
– ఇంకా పనులు పూర్తికాకున్నా 15న నీరు తోడేందుకు సన్నాహాలు
– కిలోమీటర్ మేర భూమిపైనే పైపులు
– ప్రారంభ దశలోనే మురారి, మల్లేపల్లి బ్రిడ్జిలు
– తాత్కాలిక ఏర్పాట్లకు అధికారుల యత్నాలు
– నేడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబు
సాక్షి, రాజమహేంద్రవరం / సీతానగరం : ‘పోలవరం ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలాగే ఎడమ కాలువపై ఏర్పాటు చేస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా పూర్తి కాకముందే సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారా? ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో నీరు పారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారా?’ అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పనులు పూర్తి చేయకుండానే ఈ నెల 15న అనుకున్న ప్రకారం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమను ప్రారంభించి జాతికి అంకితం చేసినట్లుగా ఇప్పుడు పురుషోత్తపట్నం ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పనులు ఈ నెల 15కి పూర్తి అయ్యే పరిస్థితి కనపడడంలేదు. అయితే అనుకున్న తేదీ ప్రకారం ఎలాగైనా ప్రారంభించేందుకు యంత్రాగం హడావుడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది.
హడావుడితో నాణ్యతకు తిలోదకాలు
గోదావరి నుంచి పురుషోత్తపట్నం వద్ద పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి 10.10 కిలోమీటర్ల దూరంలోని పోలవరం కాలువకు పంపించి అక్కడ నుంచి ఏలేరు ప్రాజెక్టుకు, ఆయకట్టును నీటిని అందించే లక్ష్యంతో రూ.1,638 కోట్లతో ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. ఏలేరు జలాశయం నుంచి విశాఖకు గోదావరి నీటిని అందించేందుకు పురుషోత్తపట్నం స్టేజ్ -1, స్టేజ్ -2గా పనులు విభజించి చేపడుతున్నారు. స్టేజ్ -1లో పంప్‌హౌస్ వద్ద పది పంపులను ఏర్పాటు చేసి ఒకో పంప్ ద్వారా 350 క్యూసెక్కులు నీటిని తోడాలని ప్రతిపాదించారు. ఆ లెక్కన మొత్తం 3,500 క్యూసెక్కుల నీటిని తోడవచ్చు. స్టేజ్ -2లో రామవరంలో పోలవరం 50వ కిలోమీటరు వద్ద పంప్‌హౌస్ నిర్మించి 8 పంపుల ద్వారా 175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరులోకి 13.12 కిలోమీటర్ల మేర రెండు లైన్లలో ఏర్పాటు చేసే పైపులైన్ల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంది. అలాగే 57.885 కిలో మీటరు కృష్ణవరం వద్ద క్రాస్ రెగ్యులేటరు నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. ఆగస్టు 15కి నీటిని అందిస్తామని ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు చెబుతుండగా పనులు మాత్రం పూర్తి కాలేదు. జగ్గంపేట మండలంలో ఒక వరస పైపులైన్ ద్వారా నీటిని పంపాలని చూస్తున్నారు. హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. పోలవరం కాలువ ద్వారా రామవరం వద్ద స్టేజ్ -2కు నీరు చేరేందుకు మురారి, మల్లేపల్లి వద్ద వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. ఈ వంతెనల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కానీ నీరు పారేందుకు వీలులేదు. బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా రోడ్డు కింద తూములు ఏర్పాటు చేసి నీరు పారించాలని అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో హడావుడిగా పనులు చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూమిపైకి లేచిన పైపులు..
10 పంపుల నుంచి ఐదు వరసలలోని తరలించేందుకు పైపులను అమర్చాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో రెండు వరసల మేర భూమిలో పైపులు వేశారు. అయితే గత నెల 18న ఈపథకంలో భాగంగా వేసిన 150 పైపులు భూమిలో నుంచి పైకి లేచాయి. దాదాపు కిలో మీటరు మేర లేచిన పైపుల్లో కొన్ని చోట్ల జాయింట్లు విడిపోయాయి. పైపులు వేయడానికి తీసిన గోతుల్లో ఈ మధ్య కురిసిన వర్షాలు, గోదావరిలో వరద వల్ల నీరు ఊరుతుండడంతో పైపులు పైకి ఉబికి వచ్చాయి. ఈ నెల 15 కల్లా నీరు తోడాలన్న ఉద్దేశంతో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా పైపులు అమర్చారు. పైపులు అమర్చే ముందు కాలువలో ఇసుక వేయలేదు. ఫలితంగా రామవరపు ఆవ వద్ద భూమిలో నీరు ఊరడంతో భూమిలోని పైపులు పైకి లేచాయి.
ప్రారంభానికి తాత్కాలిక ఏర్పాట్లు...
కాలువలో ఇసుక నింపి పైప్‌లైన్ వేయాల్సి ఉండగా, 15 కల్లా నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో పనులలో తీసుకోవలసిన నాణ్యతా చర్యలను మమ అనిపించి, పైప్‌లైన్ వేశారని పలువురు ఆరోపించారు. పైకి లేచిన పైపులను యంత్రాల ద్వారా తీవ్ర ఒత్తిడితో కిందకు నొక్కినా ప్రయోజనం లేకపోయింది. ఒక వరస మేర కిలోమీటరు పొడవున పైప్‌లైన్ భూమి పైనే ఉంచి, ప్రారంభోత్సవానికి అడ్డంకి లేకుండా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత రెండు మోటార్లను ఆఫ్ చేసి పైప్‌లైన్‌ను సరిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement