దౌర్జన్యంగా భూముల తీసుకుని నట్టేట ముంచారు
దౌర్జన్యంగా భూముల తీసుకుని నట్టేట ముంచారు
Published Tue, Jun 20 2017 10:36 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
‘పురషోత్తపట్నం’ రైతుల ఆవేదన
సంతకాలు చేయని రైతుల రిలే దీక్షల ప్రారంభం
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్
సీతానగరం (రాజానగరం) : ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంతకాలు చేయని రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నాగంపల్లి, చినకొండేపూడి, వంగలపూడి, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల రైతులు సీతానగరం బస్టాండ్‌లో మంగళవారం దీక్షలు చేపట్టారు. రిలే దీక్ష కోసం బస్టాండ్‌లో టెంట్ వేయడానికి రైతులు సిద్ధపడగా, స్థానిక ఎస్సై ఎ. వెంకటేశ్వరావు సిబ్బందితో వచ్చి టెంట్ వేయడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో టెంట్ లేకుండానే రైతులు దీక్ష ప్రారంభించారు. దీక్ష వెనుక కట్టిన ప్లెక్సీని తొలగించాలని పోలీసులు పట్టుబట్టినా రైతులు వ్యతిరేకించారు.తమ భూములు బలవంతంగా తీసుకుని, తమపై దౌర్జన్యం చేయడమే గాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆంక్షలు విధిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ..
ప్రభుత్వం నెలకొల్పే ప్రాజెక్ట్‌లకు తాము వ్యతిరేకం కాదని, అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తున్న ప్రతి ఎకరానికి రూ.33.60 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఎకరానికి రూ.28 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంటోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అవార్డ్ పాస్ చేసి, నోటీసులు జారీ చేసిన 15 రోజుల వరకూ గడువు ఉన్నప్పటికీ పోలీస్ ఫోర్స్‌తో భూములను దౌర్జన్యంగా తీసుకోవడమే గాకుండా తమపై కేసులు పెట్టి, హౌస్ అరెస్టులు చేయించడం తగునా? అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంలో పూర్తిగా భూములు కోల్పోయి నిరాశ్రయులైన రైతులకు ప్రాజెక్ట్‌ను ఆనుకుని ఉన్న భూముల్లో ఎకరం చొప్పున అందించి, జీవనాధారం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ భూముల్లోకి తమను వెళ్లనీయకుండా అడ్డుకుని పైప్‌లైన్ పనులు చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను మోసగించారన్నారు. దీక్షలో కలగర సర్వారాయుడు, కరుటూరి శ్రీనివాస్, కలవచర్ల ప్రసాద్, కోడేబత్తుల ప్రసాదరాజు, కోడేబత్తుల దొరబాబు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, తోటకూర పుల్లపురాజు, మడిచర్ల సత్యనారాయణ, మడిచర్ల రాంబాబు, కలగర బాలకృష్ణ, కొండ్రు రమేష్, చల్లమళ్ల విజయ్‌కుమార్ చౌదరి, మట్ట వసంతరావు, పోశారావు పాల్గొన్నారు.
Advertisement