పురుషోత్తపట్నం ‘ఎత్తిపోతలు’ అడ్డగింపు
పురుషోత్తపట్నం ‘ఎత్తిపోతలు’ అడ్డగింపు
Published Wed, Mar 29 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
–2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులన్న రైతులు
సీతానగరం (రాజానగరం) : మండలంలోని రామచంద్రపురం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. హైకోర్టు సూచించిన ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రామచంద్రపురం వద్ద గల తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ఎడమ కాలువ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేయడానికి పొక్లెయిన్ తరలివచ్చింది. కాలువ వద్ద పనులు చేయడానికి సిద్ధపడగా సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు. తొర్రిగడ్డ ఎడమ కాలువలో రామచంద్రపురం దూళ్ళపాటి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ వేయడానికి పొక్లెయిన్‌తో తవ్వకాలు ప్రారంభించారు. రామచంద్రపురానికి చెందిన రైతులు కలగల బాలకృష్ణ, చల్లమళ్ల గాంధీ, కోడేబత్తుల దొరాజీ, చల్లమళ్ల ధర్మరాజు, చల్లమళ్ల విజయ్‌కుమార్ చౌదరి, కోడేబత్తుల శ్రీనివాసరావు, కోడేబత్తుల పెంటయ్య, ప్రసాద్‌తోపాటుగా అధిక సంఖ్యలో రైతులు తరలివెళ్ళి పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధికారులు ఘటనా స్థలికి తరలివచ్చారు. పొక్లెయిన్‌తో ప్రభుత్వ భూములలో పనులు చేస్తున్నామని, కాలువ వద్ద పైప్‌లైన్‌కు చెందిన పైప్‌లు ఏర్పాటు చేస్తే, ఖరీఫ్‌కు సాగునీటికి అంతరాయం కలగదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం వద్ద పనులు చేయడానికి మేము ఎంతమాత్రం సుముఖంగా లేమని, హైకోర్టు తీర్పుననుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతోపాటుగా వివిధ ప్రయోజనాలు కల్పించాకే ఇక్కడ పనులు చేయడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీనితో పొక్లెయిన్ తీసుకుని అక్కడ నుంచి అధికారులు నిష్క్రమించారు.
Advertisement