పుట్టపర్తిలో పెళ్లి సందడి
పుట్టపర్తి అర్బన్ : లండన్‌కు చెందిన సత్యసాయి భక్తులు అనిల్ పటేల్ దంపతుల సహకారంతో పుట్టపర్తికి చెందిన చల్లా సోదరులు సాయిక్రిష్ణ, భీమరాజు, విజయసాయిల ఆధ్వర్యంలో గురువారం పర్తి సాయి ధర్మశాలలో సామూహిక ఉచిత వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
జిల్లా వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 72 జంటలు పెళ్లి పీటలపై కూర్చున్నాయి. తొలుత బంగారు తాళిబొట్టు, గిన్నె బొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను అందజేశారు. బంధు, మిత్రుల సమక్షంలో పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య వధువుల మెడలో తాళి కట్టారు. ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్ రాజు, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, పుడా చైర్మన్ సుధాకర్, నగరపంచాయతీ చైర్మన్ పీసీ గంగన్న, ప్రశాంతి గ్యాస్ సూర్యనారాయణ, అహ్మద్, మంగళకర ఏఓ ప్రకాష్, వైస్ చైర్మెన్ రాము తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనిల్ పటేల్ మిత్ర బృందం కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులకు సామగ్రిని అందజేశారు.