నందలూరు : మండలకేంద్రంలోని ఎంతోచరిత్ర కల్గిన ఆర్‌అండ్‌బీ బంగ్లా రానురాను అసాంఘిక కార్యక్రమాలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. వివరాలలోకి వెళితే... బ్రిటీష్‌కాలంలో నిర్మించిన ఆర్‌అండ్‌బి బంగ్లా అనేకమంది రాజకీయ నాయకులు, అటు ఉద్యోగులు బసచేసి వెళ్లేవారు. ఇంత పురాతనమైన ఈ బంగ్లాలో చెత్తాచెదారంతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే అధికారులు, రాజకీయ నాయకులు కరువయ్యారు. ఆర్‌అండ్‌బి బంగ్లాచుట్టూ ప్రహరీగోడ లేకపోవడంతో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బంగ్లా వెనుకభాగాన నిర్మానుష్యంగా ఉన్న చెట్లవద్ద మందుబాబులు అడ్డాగా మార్చుకోవడంతో బంగ్లా వెనుకవైపున ఎక్కడచూసినా వాటర్‌ప్యాకెట్లు, మందుబాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ సమావేశాలకు మాత్రమే హాజరయ్యే రాజకీయనాయకులు ఆర్‌అండ్‌బీ బంగ్లాను పట్టించుకోకపోవడంతో బంగ్లా చుట్టూ చెత్తాచెదారంచేరి విషపురుగులకు నిలయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు, రాజకీయ నాయకులు జోక్యంచేసుకుని బంగ్లాచుట్టూ ప్రహరీగోడ ఏర్పాటుచేసి శిథిలావస్థకు చేరుకున్న ఆర్‌అండ్‌బి బంగ్లాను తిరిగి నూతన భవనం ఏర్పాటుచేసి వాచ్‌మెన్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.