
రబీ రుణ లక్ష్యం రూ.932.19 కోట్లు
– లీడ్ బ్యాంక్ మేనేజర్ ధీరావత్ సూర్యం
పెద్దవూర:
ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాకు రూ.932.19 కోట్ల వ్యవసాయ రుణాలను రైతులకు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ధీరావత్ సూర్యం చెప్పారు. గురువారం మండల సమావేశ మందిరంలో జరిగిన పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(జేఎంఎల్‌బీసీ) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా రైతులకు రూ.1654.60 కోట్లు వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు రూ.1050 కోట్ల రుణాలిచ్చినట్టు పేర్కొన్నారు. పీఎం ముద్రా పథకం రుణాలను లబ్ధిదారులకు జమానతు తీసుకోకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ఇచ్చి తోడ్పాడు అందించాలన్నారు. స్టాండప్ అప్ ఇండియా పథకం ద్వారా రూ. 10లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రతి బ్యాంకు ఖచ్చితంగా రెండు యూనిట్లు ఎస్సీ, ఎస్టీ పురుషులకు, మహిళలకు అయితే ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయలన్నదే స్టాండప్ అప్ ఇండియా పథక ఉద్దేశమన్నారు. ప్రభుత్వం 12.5 శాతం రుణమాఫీని విడుదల చేసిందని రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. సంవత్సరం లోపు అప్పు తిరిగి చెల్లించకుంటే వడ్డీ లేని రుణం పథకం వర్తించదని, సకాలంలో చెల్లించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్రం 3 శాతం చెల్లిస్తుందన్నారు. రైతులు సంవత్సరం లోపు వ్యవసాయ రుణాలను రెన్యువల్ చేసుకుంటే వడ్డీ తీసుకోవద్దని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా చేరే విధంగా చూడాలన్నారు. సమావేశంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు బి.గోపాలకృష్ణ, కె.బ్రహ్మచారి, డీఆర్‌డీఏ బీపీఎం ఆర్.రామకృష్ణ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ జిల్లా డైరెక్టర్ సీ.నాగేశ్వర్‌రావు, జెఎల్‌ఎంబీసీ కన్వీనర్ పీవీ రత్నం, ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, వెలుగు ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.