సంతలో గొడ్డుల్లా కొంటున్నారు
సీఎం చంద్రబాబుపై సీపీఎం నేత రాఘవులు ఫైర్
♦ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే అప్రజాస్వామికమా?
♦ ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనడం దేశసేవా?
♦ ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకుగా మార్చేశారు
♦ పరిస్థితులు మార్చడానికి అంతా నడుంకట్టాలి
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను సంతలో గొడ్డుల్లా కొంటున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతే ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారని, అదే చంద్రబాబు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ తమ అభివృ ద్ధిని చూసి వస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అక్కడేమో అన్యాయం అయితే.. ఇక్కడ రాష్ట్రాభివృద్ధి, దేశభక్తి, దేశసేవ అవుతుందా? అని ప్రశ్నించారు.
ఓటుకు రేటు కట్టిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలకు వెల కడుతున్నారని.. చివరకు ప్రజాస్వామ్యాన్ని అంగడి సరకుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) 24వ వర్థంతి సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యాపార ధోరణి కారణంగా సాధారణ ఓటరుకు రూ. 500 రేటు పలికితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు రూ. 5 వేలు ఇచ్చారని, ఇప్పుడు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు పైనే రేటు కడుతున్నారని, ఎంపీకి గతంలోనే రూ. వంద కోట్లకుపైగా ధర పలికిందని రాఘవులు చెప్పారు.
రాజకీయాలు డిమాండ్ సప్లయ్ పద్ధతిలో ధర నిర్ణయించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. సరళీకరణ విధానాల పర్యవసానంగా అన్నీ కొనడానికి అమ్మడానికి పనికొచ్చేలా సిద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులులేని ప్రజాస్వామ్యవాదులు నెగ్గుకురాలేరన్నారు. మాకినేని బతికుంటే ఈ పోకడలపై పోరాటం చేసేవారని, ఆయన రచనలను ఇంగ్లిషుతో పాటు తెలుగులో తీసుకురావాలని రాఘవులు కోరారు. ఈ సందర్భంగా నాలుగు సంపుటాలుగా రూపొందించిన ఎంబీ రచనలు, ఉపన్యాసాలను రాఘవులు ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజాశక్తి ఎడిటర్ పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు, ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎడిటర్ కె.ఉషారాణి, ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీ కృష్ణ మాట్లాడారు.
టీడీపీది రాజకీయ వ్యాపారం
సీపీఎం నేత ప్రకాశ్ కారత్ విమర్శ
డబ్బున్న వారికే పార్టీలు టికెట్లు ఇచ్చే సంస్కృతికి రాజకీయాలు దిగజారిపోయాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ రాజకీయ వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) వర్థంతి సందర్భంగా విజయవాడలో స్మారకోపన్యాసం పేరుతో ‘25 ఏళ్ల సరళీకరణ విధానాలు-ఫలితాలు’ అనే అంశంపై కరత్ ప్రసంగిస్తూ రాజకీయ విధానాలను విళ్లేషించారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి పరిస్థితి, తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల స్థితి చూస్తే రాజకీయాల్లో విలువలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థమవుతుందన్నారు. పారిశ్రామికవేత్తలకే టికెట్లు ఇచ్చి గెలిపిస్తే వారు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారని, ప్రజలను ఎవరు పట్టించుకుంటారని కరత్ ప్రశ్నించారు.